గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కేందుకు సాహస ప్రయత్నాలను ఎంచుకొంటున్నారు. కొబ్బరి కాయను చేత్తో పగలగొట్టడమంటేనే కొందరికి కష్టమనిపిస్తుంది. అదీ తలపై పెట్టడం, వాటిని నాన్ చాకుతో పగలగొట్టడమంటే చాలా కష్టం. అంతేకాదు.. కొబ్బరికాయ తలపై గట్టిగా తగిలినా, నాన్ చాకు కొద్దిగా పక్కకు జరిగి తలకు తగిలినా అంతే సంగతులు. అసలే కొబ్బరికాయ గుండ్రంగా ఉంటుంది. నాన్ చాకుతో కచ్చితంగా పై భాగాన తగిలితేనే పగులుతుంది. లేకుంటే పక్కకు జరిగి దెబ్బ తగులుతుంది. ఇంత కష్టమైన ఫీట్ ను కర్ణాటకకు చెందిన కేవీ సైదలవి అనే మార్షల్ ఆర్టిస్ట్ మంచినీళ్లు తాగినట్టుగా చేయడం గమనార్హం.
కర్ణాటకలోని ముదుర్ ప్రాంతానికి చెందిన కేవీ సైదలవి మార్షల్ ఆర్టిస్ట్. నాన్ చాకు ఆయుధాన్ని ఉపయోగించడంలో దిట్ట. దీనిని ఆయన ప్రపంచ రికార్డు కోసం ఆసరాగా చేసుకున్నారు. గుండ్రంగా ఆరుగురు వ్యక్తులను కూర్చోబెట్టి.. వారి మధ్యలో తాను నిలుచున్నాడు. మధ్యలో గుండ్రంగా తిరుగుతూ.. ఒక్కొక్కరి తలపై కొబ్బరికాయలు పెట్టుకున్న కొద్దీ నాన్ చాకుతో పగలగొట్టడం మొదలుపెట్టాడు. చుట్టూ కూర్చున్నవారు తలపై కొబ్బరికాయలు పగిలిన కొద్దీ మరొకటి పెట్టుకుంటూ ఉండగా.. సైదలవి వాటిని పగలగొడుతూ వచ్చాడు. ఇలా కేవలం ఒక్క నిమిషంలో 42 కొబ్బరికాయలను నాన్ చాకుతో పగలగొట్టాడు.
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. సైదలవి మొదట మెల్లగా మొదలుపెట్టినా తర్వాత వేగం అందుకున్నాడని.. ప్రపంచ రికార్డు సృష్టించాడని గిన్నిస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ‘‘అవేదో కోడిగుడ్లు అన్నట్టుగా పగలగొట్టేస్తున్నాడు. కొబ్బరికాయలను తలపై పెట్టి కొట్టడమేంటి?” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘‘నాన్ చాకుతో పగలగొట్టే మార్షల్ ఆర్టిస్ట్ ఏమోగానీ.. తలపై కొబ్బరికాయలు పెట్టుకుని పగలగొట్టించుకున్నవారు మాత్రం గ్రేట్” అని మరికొందరు అంటున్నారు.