తిరుమల కొండ మీద వర్షం దంచికూడుతోంది. దీంతో శ్రీవారి ప్రధాన ఆలయం ముంగిట వర్షపు నీరు వరదలా ప్రవహించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతుండడం తెలిసిందే. ఈ ఉదయం నుంచి తిరుమలలో వర్షం పడుతుండడంతో భక్తులు ఇబ్బందికి గురయ్యారు. శ్రీవారి ప్రధాన ఆలయం ముంగిట వర్షపు నీరు ప్రవహించింది. దట్టమైన మేఘాలు ఆవరించడంతో శేషాచల కొండలు రమణీయంగా దర్శనమిస్తున్నాయి. ఘాట్ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను సైతం మేఘాలు తాకుతూ వెళుతుండడం వీడియోలో కనిపించింది.
ఇదిలావుంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి, ఈ ఉదయానికి 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 32 గంటల సమయం పడుతోంది. తమిళనాడులో పెరటాసి మాసం కావడంతో పాటు, వారాంతపు సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. నిన్న భక్తులు నారాయణగిరి నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు క్యూలైన్లలో ఉన్న ఫొటోలు మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిస్తున్నాయి.