జగన్ సీఎం అయినప్పటి నుంచి రైతుల భూములకు భద్రత లేకుండా పోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ భూదోపిడీకి తెరతీశారని ఆయన అన్నారు. 'మీ భూమి - మా హామీ'కి బదులు... 'మీ భూమి - నా భూమి' అని పేరు పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.
సర్వే అండ్ సెటిల్ మెంట్ డిపార్ట్ మెంట్ అనే పేరు పలకడం కూడా జగన్ కు చేత కాలేదని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్లకు వాలంటీర్ సంతకం పెట్టాలనడం దారుణమని చెప్పారు. స్పందనలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని... అయినప్పటికీ 90 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని జగన్ అబద్ధాలు చెపుతున్నారని అన్నారు.
నా భూమికి సంబంధించిన పాస్ బుక్ పై ఒక అవినీతిపరుడి బొమ్మ ఉండటం ఏమిటని... ఆయనేమైనా మాకు భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్ బొమ్మతో నా భూమిలో సర్వే రాయి పెట్టడం ఏమిటని మండిపడ్డారు. సర్వే రాళ్లు, పాస్ బుక్ పై జగన్ బొమ్మలను తొలగించకపోతే కోర్టుకు వెళ్తానని అన్నారు. సర్వే రాళ్లపై బొమ్మలు కూడా పెద్ద స్కామ్ అని ఆరోపించారు.