గతేడాది నుంచి కనిపించకుండా పోయిన చైనా దిగ్గజ పారిశ్రామికవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. జపాన్ లోని టోక్యోలో రహస్య జీవనం సాగిస్తున్నట్టు వెలుగు చూసింది. ఆరు నెలల నుంచి ఆయన జపాన్ లో ఉంటున్నట్టు సమాచారం. చైనాలో టెక్నాలజీ కంపెనీలపై కమ్యూనిస్ట్ సర్కారు ఉక్కుపాదం మోపుతూ, కఠిన చర్యలకు దిగడం తెలిసిందే. టెక్నాలజీ అండతో కొన్ని కంపెనీలు పోటీని నిర్వీర్యం చేస్తుండడం అక్కడి సర్కారుకు నచ్చలేదు. డేటాపై అధిక పెత్తనం చేస్తూ, వ్యాపారాలను విస్తరించుకుంటుండడాన్ని చూసి ఊరుకోలేకపోయింది. అందులో భాగంగానే టెక్నాలజీ కంపెనీలపై కఠిన చర్యలకు దిగింది.
అప్పటి నుంచి జాక్ మా ప్రజలకు కనిపించడం లేదు. చైనా సర్కారే జాక్ మాను ఏదో చేసి ఉండొచ్చన్న సందేహాలు కూడా ఆ మధ్య వచ్చాయి. జాక్ మాకు చెందిన యాంట్ గ్రూపు ఐపీవోకు కమ్యూనిస్ట్ సర్కారు అనుమతించలేదు. పెద్ద ఎత్తున జరిమానాలు కూడా విధించింది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. జాక్ మా ఆరు నెలలుగా టోక్యోలో కుటుంబంతో కలసి ఉంటున్నారు. మధ్యలో అమెరికా, ఇజ్రాయెల్ ను సందర్శించినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ (బ్రిటిష్ వార్తా పత్రిక) పేర్కొంది.