తుఫాను నష్టాన్ని అంచనా వేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఎక్కడా రైతులు నిరాశకు గురికాకూడదని దిశానిర్దేశం చేశారు. మాండూస్ తుపాను, భారీ వర్షాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. రంగుమారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయకూడదన్న మాట ఎక్కడా రాకూడదని, తక్కువ రేటుకు కొంటున్నారన్న మాట ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒకవేళ రైతులు బయట అమ్ముకుంటున్నా వారికి రావాల్సిన రేటు వారికి రావాలని, ఆ రేటు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురిసిన జిల్లాల కలెక్టర్లందరూ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పంటలు దెబ్బతిన్న చోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే, ఆ కుటుంబానికి రూ.2 వేల నగదు, రేషన్ అందించాలని తెలిపారు. ఇంట్లోకి నీళ్లు వచ్చినా గానీ, ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట రాకూడదని నిర్దేశించారు. నీళ్లు ఇంట్లోకి వచ్చిన వారికి కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందించాల్సిందేనని తేల్చిచెప్పారు.