విశాఖపట్నం జిల్లా,గొలుగొండ, మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఇటీవల రంగురాళ్ల తవ్వకాలకు సంబంధించి అటవీ శాఖాధికారులు బుధవారం సాలికమల్లవరంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా నర్సీపట్నం సెక్షన్ ఫారెస్టర్ రమణ విలేఖరులతో మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన రంగురాళ్ల తవ్వకాలు జరిపిన అడ్డల్లోవ, సుద్దలపాలెం గ్రామాలకు చెందిన 15 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. సాలికమల్లవరం గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూడా రంగురాళ్ల తవ్వకాలు జరిపినట్టు సమాచారం అందిందని పేర్కొన్నారు. వీరంతా నర్సీపట్నం డీఎఫ్వో కార్యాలయంలో హాజరుకావాలని 19వ తేదీన సమాచారం పంపామని, కానీ తవ్వకందారులు తక్షణం గ్రామస్థులకు సమాచారం అందించామన్నారు. సమాచారం అందించినప్పటికీ తవ్వకందారులు స్పందించకపోవడంతో బుధవారం సిబ్బందితో కలిసి సాలికమల్లవరం వచ్చి విచారణ చేపట్టామన్నారు. తవ్వకందారులు ఇళ్లల్లో లేకపోవడంతో గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చామన్నారు. రెండు రోజుల్లో నర్సీపట్నం డీఎఫ్వో కార్యాలయంలో హాజరుకావాలని చెప్పామన్నారు.