కందుకూరు ఘటనలో మరణించిన ఆ త్యాగమూర్తుల రుణం తీర్చుకుంటామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన కావలిలో బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కందుకూరు సంఘటనను గుర్తుచేసుకుని కదిలిపోయారు. ఆత్మబంధువులు చనిపోయారనేదే నా ఆవేదన అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఆ త్యాగమూర్తుల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ పరంగా ఆర్థికసాయం చేశామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కందుకూరు ఘటనపై ప్రధాని వెంటనే స్పందించి పరిహారం ప్రకటించారని, కానీ సంతాపం తెలిపే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకుండా పోయిందని విమర్శించారు. ప్రధాని స్పందన చూసిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించారని చంద్రబాబు ఆరోపించారు.
కందుకూరు ఘటన పట్ల అందరూ సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. పెద్ద దిక్కుగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చానని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. చంద్రన్న బీమా పథకం ఉండుంటే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం లభించేదని చెప్పారు. కందుకూరు ఘటన జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
నిన్నటి ఘటన తర్వాత పర్యటన కొనసాగించాలా? వద్దా? అని ఆలోచించానని, కానీ ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడుకోవాలన్న బాధ్యతతో కావలి వచ్చానని వివరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందరూ కదం తొక్కుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఇంటికొకరు పార్టీ జెండా పట్టుకుని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసులు పెడతారని ఎవరూ భయపడొద్దని అన్నారు.
ఓట్లు కొనేందుకే జగన్ అక్రమ సంపాదన అని ఆరోపించారు. ఓటుకు రూ.10 వేలు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారు అని వివరించారు. శివుడి మాదిరిగా మీరందరూ ఆ భస్మాసురుడికి వరం ఇచ్చారు... ఇప్పుడా భస్మాసురుడు మీ నెత్తినే చెయ్యి పెడుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతలు సైకో దగ్గర పనిచేస్తున్నారని తెలిపారు. సైకో చెప్పాడని పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, అమాయకులను వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ్టి తన పోరాటం తన కోసం కాదని, ఇప్పుడు పుట్టిన పిల్లల కోసం, పుట్టబోయే పిల్లల కోసం అని స్పష్టం చేశారు.
ఇక కావలి సభకు హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, "నేనెంత సమయం పాటు మాట్లాడినా మీరు ఇక్కడే ఉండేట్టు ఉన్నారు. నేను కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా. ఏదేమైనా కావలి అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి" అని అభిలషించారు. 2024లో ఎన్నికలు జరగడానికి ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తన ప్రసంగం చివర్లో చంద్రబాబు ఓ చిన్నారిని ఎత్తుకున్నారు. టీడీపీ దుస్తుల్లో వచ్చిన ఆ చిన్నారి పార్టీ నినాదాలు చేస్తూ, గత టీడీపీ ప్రభుత్వ పథకాల పేర్లు చెబుతూ చంద్రబాబును ఆకట్టుకోవడం విశేషం.