సంక్రాంతి పర్వదినాల్లో జూద క్రీడల వైపు ఆకర్షితులు కాకుండా ఆహ్లాదకరమైన పోటీలను నిర్వహించటం అభినందనీయమని తహసీల్దార్ బి. రామానాయక్ తెలిపారు. ఘంటసాలలోని దిరిశంవాని దళితవాడలో జై జీవన్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. గ్రామపంచాయతీ స్థాయిలో మూడు రోజులపాటు జరిగే ఈ సంబరాలను తహసీల్దార్ బి. రామానాయక్ ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో ఆటలు, సాంస్కృతిక పోటీలు, సాంప్రదాయక వంటక పోటీలు, గృహాలంకరణ, పాటల పోటీలు, ఫ్యాన్సీ డ్రస్ కాంపిటేషన్, ముగ్గుల పోటీలు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో తదితర పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామానాయక్ మాట్లాడుతూ యువత చెడు మార్గంలో పయనించకుండా ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయటం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం బాబూ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె. శ్రీనివాస్, డాక్టర్ వేమూరి ప్రమోద్ కుమార్, టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం జనరల్ సెక్రటరీ దిరిశం బాలకటయ్య, రిటైర్డ్ తహసీల్దార్ పాలా సోమేశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు దిరిశం వెంకటలక్ష్మి, కొడాలి భక్త్ విజయ్, నందేటి శ్రీనివాసరావు, జై జీవన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.