రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ గతవారం విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన గత ఏప్రిల్‌లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘నేను ప్రయాణిస్తున్న విమానం కూలిపోవచ్చు’ అని ప్రిగోజిన్ చెప్పడం ఆ వీడియోలో ఉంది. ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు పూర్తిగా సహకారం అందించారు. అయితే, రష్యా సైన్యంపై అసహనంతో ఉన్న ఆయన.. రష్యా నాయకత్వాన్ని కూలదోస్తామని రెండు నెలల కిందట ప్రిగోజిన్ తిరుగుబాటు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, ఈ తిరుగుబాటు టీ కప్పులో తుఫాను మాదిరిగా సమసిపోయింది.
తాను పెంచి పోషించిన వ్యక్తే తనకు ఎదురుతిరగడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహించలేకపోయారని, ప్రిగోజిన్‌పై ఆయన ప్రతీకారంతో రగిలిపోయారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అందుకే పుతిన్ నుంచి తనకు ప్రాణగండం పొంచి ఉందని ప్రిగోజిన్‌కు ముందే తెలుసుకాబట్టే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. ఏప్రిల్ 29న ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ప్రిగోజిన్ మరణం తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రిగోజిన్ మృతి వెనక పుతిన్ హస్తం ఉందని ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ..ఈ వీడియో వెలుగులోకి రావడంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. ‘‘రష్యా ఈ రోజు విపత్తు అంచున ఉంది.. ‘కాగ్’లను సర్దుబాటు చేయకుంటే విమానం మధ్యలో కూలిపోవచ్చు’’ అని ప్రిగోజిన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మేమిప్పుడు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాం.. నేను ఎందుకు ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నానంటే.. ఈ దేశంలో జీవించేవారి ముందు బతికే హక్కు నాకు లేదు.. ఇప్పుడు వారు అబద్ధాలు చెబుతున్నారు.. దానికంటే నన్ను చంపడం మంచిది’’ అని అందులో పేర్కొన్నారు.
‘‘నేను మాత్రం అబద్ధాలు చెప్పడం లేదు.. రష్యా విపత్తు అంచున ఉందని నిజాయతీగా చెప్పగలను.. ‘కాగ్’లను సర్దుబాటు చేసుకోకుంటే విమానం గాల్లో ఉండగానే కుప్పకూలిపోవచ్చు’’ అని ప్రిగోజిన్ స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉండగా.. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించి ఉండకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ, రష్యా అధికారికంగా ప్రిగోజిన్ మరణాన్ని ఆదివారం ధ్రువీకరించింది. అలాగే, అతడి మరణం వెనక కుట్ర ఉందన్న వార్తలను కొట్టిపారేసింది. ఆ తిరుగుబాటు అణచివేతకు గురైన తరువాత యెవ్‌జెనీ ప్రిగోజిన్ మరణం అంచున జీవించారు. ఎన్నో ఏళ్లుగా పుతిన్.. ప్రిగోజిన్ సేవలను వాడుకుంటూ వచ్చారు. కానీ, వాగ్నర్ సైనికుల తిరుగుబాటు మాత్రం పుతిన్‌కు రుచించలేదు. ప్రిగోజిన్ తనకు ఎదురుతిరిగినప్పుడు, దీన్ని ఒక దేశద్రోహంగా పుతిన్ అభివర్ణించారు.