ఇస్రో చేపట్టిన చంద్రయాన్- మిషన్‌లో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టి పరిశోధనలు సాగిస్తున్న ప్రగ్యాన్ రోవర్.. తొలిసారి విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసింది.బుధవారం ఉదయం 7.35 గంటలకు రోవర్ నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలు క్లిక్‌మనించిందని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ కెమెరాలను బెంగుళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ల్యాబ్‌లో తయారు చేసినట్లు వెల్లడించింది.కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్‌ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది.
దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది.