తిరుపతి జిల్లా గూడూరులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వారిని కారుతో తొక్కించుకుంటూ వెళ్లాడు. కారును అడ్డుకున్న స్థానికులు ఆ యువకుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పాదచారులు గాయపడ్డారు. 6 బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. గూడూరులోని బజారువీధిలో బుధవారం (ఆగస్టు 30) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బజారు వీధిలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న సమయంలో ఓ యువకుడు కారుతో అటు వైపు వచ్చాడు. వాహనంపై నియంత్రణ కోల్పోయి.. దారిలో వెళ్తున్న వారితో పాటుగా పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనతో పాదచారులు భయభ్రాంతులకు గురయ్యారు. వాహనదారులు సైతం ఉలిక్కిపడ్డారు. కారులోని యుువకుణ్ని అదుపులోకి తీసుకున్న స్థానికులు.. ఆగ్రహంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. డ్రైవింగ్ సరిగా రాకున్నా.. కారు తీసుకొచ్చి ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.