ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీచ కీచకుడికి శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 03:33 PM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముదినేపల్లి, దేవరం గ్రామానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన మెండేం జగన్మోహన్‌రావు (70)కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000ల జరిమానా విధిస్తూ మంగళవారం మచిలీపట్నం పోక్సో కోర్టు జడ్జి మహ్మద్‌ ఫహ్జునుల్లా తీర్పు చెప్పారు. బాలిక హైస్కూల్‌కు వచ్చే సమయంలో నిత్యం దారి కాచి జగన్మోహన్‌రావు వికృత చేష్టలకు పాల్పడినట్టు అతనిపై బాధితురాలు గతేడాది సెప్టెంబరు 27న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ షణ్ముఖ సాయి కేసు నమోదు చేశారు. నిందితుడిని అక్టోబరు 7న అరెస్టు చేసి మచిలీపట్నం కోర్టులో హాజరుపర్చగా, జడ్జి రిమాండ్‌ విధించారు. అనంతరం ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి కేసును పరిశీలించి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించటంతో డీఎస్పీ ఇ. శ్రీనివాసులు, కైకలూరు రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌, ప్రస్తుత ముదినేపల్లి ఎస్‌ఐ డి.వెంకట్‌ కుమార్‌ దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుకు నివేదిక అందజేశారు. ఈ కేసులో నేరం రుజువు కావటంతో జగన్మోహనరావుకు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్‌ఐ వెంకట్‌ కుమార్‌ తెలిపారు. ముద్దాయిని రాజమండ్రి జైలుకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa