రోడ్డుపై చోటు చేసుకున్న చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకునేందుకు కారణమైంది. కాకినాడ జిల్లా కేంద్రంలో శనివారం (అక్టోబర్ 21) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ నాగమల్లి తోట జంక్షన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ పొరపాటున బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆటోడ్రైవర్, బైకిస్ట్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆటోను వెంబడించిన బైకిస్ట్.. జేఎన్టీయూ వద్ద ఆటోను అడ్డుకొని, డ్రైవర్‌తో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగి, ఆటో డ్రైవర్‌పై పిడిగుద్దులు కురిపించాడు. బైకర్ దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ కింద పడిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన అతడిని స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.