అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షలు విలువ చేసే 15కేజీల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను చిత్తూరు రెండో పట్టణ సీఐ ఉలసయ్యతో కలిసి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సోమవారం మీడియాకు వివరించారు. సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఇరువారం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరు వైపు నుంచి చిత్తూరుకు వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, కృష్ణాజిల్లా లక్ష్మీపురం పోరంకికి చెందిన ఫణీంద్ర (42) ఎలాంటి రశీదులు లేకుండా రూ.12లక్షల విలువ చేసే 15 కేజీల వెండి తీసుకొస్తున్నారు. వెండి వస్తువులకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతోనే సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వాటికి సరైన బిల్లులను చూపించి, వెండి వస్తువులను తీసుకెళ్లొచ్చన్నారు. వెండి వస్తువులు పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్‌ఐ ప్రసాద్, ఇక్బాల్, నగరపాలక సిబ్బంది గోపి, గోపాలకృష్ణ వర్మను డీఎస్పీ అభినందించారు.