2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అంతటా ఉత్కంఠ నెలకొంది. శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలోనూ కొన్ని సర్వేలు వైసీపీ వైపు, మరికొన్ని సర్వేలు టీడీపీ కూటమికి మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల్లో ఓటరు నాడి స్పష్టంగా తెలియాలంటే జూన్ నాలుగో తేదీ వైపు ఆగాల్సి ఉంది. అయితే కౌంటింగ్ ముందు వైసీపీ షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ.. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పోస్టల్ బ్యాలెట్లపై సీల్, హోదా వివరాల విషయంలో ఎన్నికల సంఘంతో ఆదేశాలతో ఏకీభవిస్తూ కీలక తీర్పు ఇచ్చింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కీలక సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా.. సంతకం ఉన్నా సరిపోతుందంటూ ఆదేశాలు జారీచేసింది. ఇదే సమయంలో సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక 13ఏ మీద అటెస్టింగ్ అధికారి పేరు, వివరాలు లేకున్నా కూడా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఆర్వో సీల్ లేకున్నా అనుమతించాలనే ఈసీ మార్గదర్శకాలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ మీద శుక్రవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
శనివారం సాయంత్రం వైసీపీ వేసిన పిటిషన్ మీద హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఈసీ నిబంధనలతో ఏకీభవించిన హైకోర్టు.. వైసీపీ వేసిన పిటిషన్ కొట్టివేసింది. ఏపీ ఎన్నికల్లో ఈసారి భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతతోనే కూటమికి ఓట్లు వేశారని టీడీపీ నేతలు చెప్తుండగా.. ఇదంతా పాజిటివ్ ఓట్లను వైసీపీ చెప్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై హైకోర్టు తీర్పుతో కౌంటింగ్ మరింత ఆసక్తికరంగా మారింది.