ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం.. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై ఫోకస్ పెట్టింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందే ధర్మారెడ్డిని ప్రభుత్వం సెలవుపై పంపింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి శ్యామలరావును ఈవోగా నియమించారు. కొత్త ఈవోను నియామకం తర్వాత తిరుమల కొండపై మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే దూకుడు పెంచిన ఈవో... వరుసగా సమీక్షలు, తనిఖీలతో హోరెత్తిస్తున్నారు.
తాజాగా, టీటీడీ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కీలక చర్యలు చేపట్టారు. గత పాలకమండలి తీర్మానాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టించారు. ఆగస్టు 2023 నుంచి మార్చి 2024 వరకు మొత్తం ఎనిమిది సార్లు పాలక మండలి సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన తీర్మానాల వివరాలను గోప్యంగా ఉంచడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీటీడీ అధికారులు ఆ తీర్మానాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. టీటీడీలో జరిగే ప్రతి అంశం గురించి పారదర్శకంగా వ్యవహరించాల్సిందేనని ఈవో స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హాయాంలో టీటీడీ ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు, టెండర్లు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల దుర్వినియోగం, గదుల పనులు/ గెస్ట్‌హౌస్‌ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కూడా విజిలెన్స్ అధికారుల విచారణ మొదలైంది. ఇక, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు.. తిరుమలలో ‘ఓం నమో వేంకటేశ్వరాయ నమః’ అన్న పదం తప్ప ఇంకే పదం వినిపించకూడదని స్పష్టం చేశారు.