ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు దేశం మొత్తాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉగ్రవాదులను ఏరివేసేందుకు పోలీసులు, భద్రతా బలగాలు నిత్యం రకరకాల ఆపరేషన్లు చేస్తుండగా.. నక్కి ఉన్న ఉగ్రవాదులు.. సైన్యంపైకి కాల్పులు, బాంబులతో తెగబడుతూనే ఉన్నారు. ఇక ఆది, సోమ వారాల్లో జరిగిన ఉగ్రదాడులు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో వెళ్తున్న సైనిక వాహనాలపైకి.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు నేలకొరిగారు. అయితే ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయించుకున్న సైన్యం.. వారిపై కాల్పుల వర్షం కురిపించింది. ఉగ్రవాదులను నిలువరించడమే కాకుండా పారిపోయేలా చేసేందుకు వేలాది తూటాలను వారిపైకి ప్రయోగించారు.
సైన్యం ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రమూక దాడి ప్రారంభించగానే.. అలర్ట్ అయి వెంటనే స్పందించిన భారత సైన్యం.. ప్రతిదాడులతో తీవ్రంగా వారిపైకి విరుచుకుపడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఉగ్రదాడిలో గాయాలపాలైన సైనికులను రక్షించుకోవడంతోపాటు.. మరింత మంది జవాన్ల ప్రాణాలు పోకుండా ఉండేందుకు ఉగ్రవాదులపై కాల్పుల వర్షానికి దిగింది. ఈ క్రమంలో భారత సైన్యంలోని 22 గడ్వాల్ రెజిమెంట్.. దాదాపు 5189 రౌండ్ల కాల్పులు ఉగ్రమూకపై జరిపినట్లు వెల్లడైంది. దాంతో భయపడిపోయిన ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అడవుల్లోకి పరారైనట్లు తెలిసింది.
కథువాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్‌నోతా గ్రామానికి సమీపంలోని మాచేడీ- కిండ్లీ- మల్హార్ రోడ్డులో రెండు సైనిక వాహనాలపై సోమవారం ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. దీంతో స్పందించిన సైనికులు.. ఎదురుకాల్పులు చేశారు. అప్పటికే ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది సైనికులు ఆ ప్రాంతానికి చేరుకునేలోపు.. నాన్‌స్టాప్‌గా ఉగ్రవాదులపైకి బుల్లెట్లు కాల్చారు. ఈ క్రమంలోనే ఓ సైనికుడి చేతికి తీవ్ర గాయమైనప్పటికీ.. మరో చేతితో కాల్పులు జరిపారు.
ఇక ఈ ఘటనపై ఆరా తీసిన ఉన్నతాధికారులు.. ఘటనాస్థలంలో రక్తంతో తడిసిన సైనికుల హెల్మెట్లు, పగిలిపోయిన వాహనాల టైర్లు, జవాన్ల రక్షణ కవచాలను పరిశీలించారు. వాటిని పరిశీలించిన తర్వాత ఉగ్రవాదులు, సైనికులకు మధ్య ఏస్థాయిలో కాల్పులు జరిగాయో అర్థమైందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఉగ్రవాదులకు-సైనికులకు మధ్య 2 గంటలకుపైగా కాల్పులు జరిగాయని తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులు.. వేర్వేరు ప్రాంతాల్లో దాక్కొని.. దాడులకు తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. కథువాలో సైనిక వాహనంపై ఉగ్రఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. సైనికుల త్యాగాలు వృథా కావని.. ఈ ఘాతుకానికి పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని రక్షణ శాఖ పేర్కొంది. వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది.