ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంత్- రాధిక పెళ్లి కోసం అంబానీ ఖర్చు పెట్టింది ఇంతేనా.. సగటు భారతీయుల కంటే తక్కువే

national |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 11:08 PM

భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ పెళ్లి గురించి దాదాపు 6 నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఇది నిలిచిందని చెప్పొచ్చు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ఓనర్ అయిన వీరెన్ మర్చంట్- షైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌తో.. అనంత్ అంబానీ పెళ్లి జులై 12న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల నుంచి ఎందరో సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే పెళ్లి ఇప్పుడు జరగ్గా.. ముందస్తు వేడుకలు ఎప్పుడో మొదలయ్యాయి.


మొదట గుజరాత్ జామ్ నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత ఇటలీలో గ్రాండ్ క్రూయిజ్‌లో రెండో సారి పెళ్లి ముందస్తు వేడుకలు జరిగాయి. ఇప్పుడు ముంబైలో పెళ్లితో ముగిసింది. ఇంకా జులై 13న ఆశీర్వాద్, జులై 14న రిసెప్షన్ వేడుకలు ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లోనే జరగనున్నాయి. దాదాపు అన్ని రంగాల నుంచి దిగ్గజాలు, ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకాగా.. ముకేశ్ అంబానీ వేల కోట్లల్లో ఖర్చు చేశారు. అయితే ఇక్కడే తెలిసిన విషయం ఏంటంటే.. అంబానీ తన నికర సంపద నుంచి పెద్ద మొత్తం ఏం ఖర్చు చేయలేదని తెలుస్తోంది.


అంబానీ కుటుంబం.. ఈ పెళ్లి వేడుకల కోసం మొత్తం తమ నికర సంపదలో కేవలం 0.5 శాతం మాత్రమే వెచ్చించిందని NC ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ నితిన్ చౌదరీ తన అనలిసిస్ రిపోర్టులో వెల్లడించారు. అయితే సగటు భారతీయ కుటుంబాలు తమ సంపదలో ఇంత కంటే పెద్ద మొత్తమే ఖర్చు చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.


ఉదాహరణకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు నికర సంపద ఉన్న భారత కుటుంబీకులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం రూ. 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇక ఇదే రూ. 10 కోట్ల వరకు సంపద ఉన్న వారు దాదాపు రూ. 1.5 కోట్ల వరకు పిల్లల పెళ్లిళ్ల కోసం వెచ్చిస్తున్నారని చెప్పారు. ఇది వారి మొత్తం సంపదలో చూసినట్లయితే కనీసం 5 నుంచి 15 శాతం వరకు ఉన్నాయని.. అదే అంబానీ మాత్రం తన సంపదలో 0.5 శాతమే కుమారుడు అనంత్ పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నారని వివరించారు.


అంతర్జాతీయ స్థాయిలో సింగర్లు, డాన్సర్లు, నటీనటులు, క్రీడా, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు ఎందరో వచ్చినా మొత్తంగా దాదాపు రూ. 5 వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చవుతున్నట్లు తెలిసింది. ఇది 0.6 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందన్నమాట. ఇక అంబానీ మొత్తం సంపద 123.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. అందులో 0.6 బిలియన్ డాలర్లు అనేది కేవలం 0.5 శాతం మాత్రమేనని నితిన్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com