ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మంకీపాక్స్ కలవరం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆఫ్రికా దేశాల్లో పుట్టిన ఈ ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్ గత కొంత కాలంగా ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలె భారత్‌లో కూడా తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. దీనిపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దేశంలో రెండో మంకీపాక్స్ కేసు కూడా వెలుగు చూసింది. కేరళకు చెందిన ఓ వ్యక్తిలో ఈ ఎంపాక్స్ వైరస్‌ను గుర్తించినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఆ వ్యక్తి ఇటీవలె యూఏఈ నుంచి వచ్చినట్లు కేరళ అధికారులు వెల్లడించారు.
మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవలె కేరళకు చేరుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగు కాకపోవడంతో మంజేరి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరాడు. అతని లక్షణాలు గుర్తించిన వైద్యులు.. అవి మంకీపాక్స్ లక్షణాలే అని అనుమానించారు. దీంతో అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా.. మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వీణా జార్జ్ సూచించారు. అలాంటి వారికి త్వరగా చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో విస్తరిస్తున్న ఈ మంకీపాక్స్ వైరస్.. ఇటీవలె భారత్‌లోకి ప్రవేశించింది. గత కొన్ని రోజుల క్రితం ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ తరహా లక్షణాలు గుర్తించగా.. అతడి నమూనాలను పరీక్షించగా.. అది ఎంపాక్స్ అని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతంలో వెలుగుచూసిన ఎంపాక్స్ వైరస్ కంటే ఈసారి సోకిన వేరియంట్‌తో ప్రమాదం ఉండదని ప్రభుత్వం చెప్పింది.