బుడమేరు ఆక్రమణల తొలగింపుపై పక్షం రోజుల్లో యాక్షన్ ప్లాన్‌కు దిగుతాం. ఇప్పటికే ఆక్రమణలకు సంబంధించిన అన్ని వివరాలు సేకరించడం పూర్తయింది. అయితే తెలంగాణలో హైడ్రా తరహాలో దూకుడు ప్రదర్శించబోం అని టీడీపీ నేతలు తెలియజేసారు. ఏ విషయంలోనైనా మానవీయ కోణంలో వ్యవహరించండన్న మా అధినేత చంద్రబాబు సూచనల మేరకు చిన్న చిన్న ఆక్రమణదారుల విషయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళతాం. పెద్ద ఆక్రమణదారుల విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండదు. నగరంలోని ప్రధాన డ్రెయిన్ల ఆక్రమణల తొలగింపుపై కూడా దృష్టి సారించనున్నాం.
ముఖ్యంగా రైల్వే స్థలాల ఆక్రమణ ఎక్కువగా ఉంది. ఈ కారణంగా వీఎంసీ, రైల్వే అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. వారి సూచనలతో ఆక్రమణల తొలగింపుపై ముందుకెళ్తాం. అలాగే స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులను గతంలో టీడీపీ హయాంలో ప్రారంభిస్తే వైసీపీ హయాం లో అడ్డుకుని ఆపివేశారు. తిరిగి ఆ పనులను ప్రారంభిస్తాం. ఆ పనులు పూర్తయితే నగరంలో వరద నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.