ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉప-ముఖ్యమంత్రి.. మైక్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించి రాష్ట్ర గీతాన్ని రెండోసారి పాడించడం తీవ్ర విమర్శలు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి ఫెలోషిప్ ప్రాజెక్టు కింద శిక్షణ పూర్తి చేసుకున్న 19 మందికి సెక్రటేరియట్‌లో శుక్రవారం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉప- ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. అయితే, కార్యక్రమ ప్రారంభంలో తమిళ తల్లి గీతం ఆలపించగా.. మైకు సరిగా పని చేయకపోవడతో ద్రావిడ నల తిరునాడుమ్ అనే వాక్యంలో తిరునాడుమ్ వినిపించలేదు. దీంతో డిప్యూటీ సీఎం వెంటనే గ్రహించి మళ్లీ మొదటి నుంచి ప్రార్థనాగీతం పాడించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రెండోసారి కూడా వాళ్లు తిరునాడమ్ పదాన్ని సరిగ్గా ఉచ్చరించకపోవడం గమనార్హం.
అనంతరం ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర గీతం ఆలపిస్తుండగా మైక్రోఫోన్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఓ పదం సరిగ్గా వినిపించలేదని, అందుకే రెండోసారి పాడించామని వివరణ ఇచ్చారు. అణగారిన వర్గాలలో అవగాహన కల్పించిన ద్రావిడ పార్టీల ఎదుగుదలను ఆర్య ఆధిపత్య శక్తులు సహించలేకపోతున్నాయని గవర్నర్‌పై ఉదయనిధి విరుచుకుపడ్డారు.
‘ఈ వ్యక్తి (గవర్నర్) ఉన్నారు... అసెంబ్లీలో ఆయనకు ఇచ్చిన ప్రసంగంలో ద్రావిడ మోడల్ అనే పదాన్ని వదిలేస్తారు.. హిందీ మాస వేడుకల్లో పాల్గొనవద్దని మేం చెబితే ద్రవిడం అనే పదాన్ని పక్కనబెట్టి రాష్ట్ర గీతం ఆలపిస్తారు... ద్రవిడం అనే పదాన్ని ఉచ్చరిస్తే నీ నాలుక అపవిత్రం అవుతుందా?’ అని స్టాలిన్ ప్రశ్నించారు. ద్రవిడమ్ అనే పదం విని మీ కడుపు మండితే మేం చేసే పని మేము చేస్తామని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
అయితే, దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర గీతానికి అవమానం జరిగితే.. ఆ తప్పిదాన్ని ఆయన సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించింది. డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న ఆయన ఇచ్చిన వివరణను తాము ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే వనతీ శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతాన్ని సరిగ్గా పాడించడంలో విఫలమైన మీకు డిప్యూటీ సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు.
ఉదయనిధి తక్షణమే ఉప-ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ డిమాండ్ చేశారు. ‘డీడీ తమిళ కార్యక్రమంలోనూ ఇలాగే జరిగితే గవర్నర్ మీదకు డీఎంకే తప్పు నెట్టేసింది.. ఉదయనిధి ముఖ్య అతిథిగా హాజరైన ప్రస్తుత కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని రెండోసారి పాడించినా తప్పులే దొర్లాయి.. కాబట్టి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలి’ అని మురుగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల, చెన్నైలో జరిగిన హిందీ మాసోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గీతంలో ‘ద్రవిడ’పదాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఉచ్చరించపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.