ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిస్థితి చేయిదాటితే నేనే హోంమంత్రి.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2024, 07:39 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంశాఖను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఏపీలో శాంతి,భద్రతలపైనా, హోం శాఖపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. తాను హోంమంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీశాఖ మంత్రిని అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఏపీలో జరుగుతున్న ఘటనలకు హోంమంత్రి వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలన్నారు. హోంశాఖపై రివ్యూ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.


లా అండ్ ఆర్టర్ చాలా కీలకమన్న పవన్ కళ్యాణ్.. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని అన్నారు. నేరస్థులకు కులం, మతంతో సంబంధం లేదన్న పవన్ కళ్యాణ్.. క్రిమినల్స్‌ను అరెస్ట్ చేయవద్దని ఏ చట్టం చెప్తోందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. తాను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకు ఏం చెప్తోందన్న పవన్.. కులంతో సంబంధం లేకుండా నేరస్థులను శిక్షించాలన్నారు. గత ప్రభుత్వంలోలాగా పోలీసులు అలసత్వంతో ఉండొద్దని.. తెగేవరకూ లాగకండి అంటూ సూచించారు. ఘటనలపై బయటకు వస్తే తమను తిడుతున్నారని.. డీజీపీ బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.


"వైసీపీ వాళ్లు ఇష్టమొచ్చినట్లు రౌడీల్లా వ్యవహరిస్తుంటే హోంమంత్రి వంగలపూడి అనిత ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించండి. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, హోంశాఖ మంత్రిని కాదు, పరిస్థితులు చెయ్యి దాటితే నేను హోంశాఖ తీసుకుంటాను, నేను తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలో వ్యవహరిస్తా. డీజీపీ గత ప్రభుత్వం తరహాలో వ్యవహరించకూడదు. బాధ్యత తీసుకోండి, పాత పద్ధతులు పాటిస్తాం అంటే చూస్తూ ఊరుకోను, ప్రజలు ఇచ్చిన పదవి ఇది, వారికి రక్షణ కల్పించాలి. పాలనలో ఒకరు వచ్చి ఇంకొకరిపై విమర్శలు చేస్తాం, చులకనగా చూస్తాం అంటే.. నాకు పదవి పోయినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. కానీ నా ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధం" అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఏపీలో ఎన్డీఏ కూటమిది స్థిరమైన ప్రభుత్వమని చెప్పిన పవన్ కళ్యాణ్.. వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయని చెప్పారు. అలాగే కూటమిని ఎవరు చెడగొట్టలేరని, వ్యక్తులు వచ్చి ఎవరికి వారు సొంత పెత్తనం చేసుకుని గేమ్స్ ఆడితే తమను ఏమీ చేయలేరన్నారు. తాను, చంద్రబాబు క్లారిటీతో ఉన్నామన్న పవన్ కళ్యాణ్.. ఈ పొత్తు స్థిరమైందని.. కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు తమ పొత్తును దెబ్బతీయలేవన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com