కెనడాలో హిందూ ఆలయంపై దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దాడి పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి హిందువులకు రక్షణ కల్పించేలా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. హిందువులపై దాడులు జరుగుతుంటే అంతర్జాతీయ నేతలు ఏం చేస్తున్నారన్న పవన్ కళ్యాణ్.. దీనిపై ఎన్జీవోలు, ప్రపంచ లీడర్లు స్పందించాలని కోరారు. ఇతర మతాల పట్ల వ్యవహరించే రీతిలోనే.. హిందువులపై దాడుల అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరారు.
"పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ వంటి చోట్ల హిందూ సోదరులు, సోదరీమణులపై వేధింపులు, హింసాత్మక ఘటనలతో పాటుగా వారు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆందుకే వారిపై అశ్రద్ధ ఉంటోంది. అలాగే వారికి మద్దతు కూడా తక్కువ. అందుకే చాలా సులభంగా లక్ష్యంగా మారుతున్నారు. వారిపై జరిగే ప్రతి ద్వేషపూరిత చర్య మానవత్వం, శాంతిని గౌరవించే వారందరికీ దెబ్బ. కెనడాలోని హిందూ దేవాలయంపై, హిందువులపై ఈరోజు జరిగిన దాడి నా హృదయాన్ని తాకింది. ఈ దాడి నాకు ఎంతో వేదన, ఆందోళన కలిగించింది. కెనడా ప్రభుత్వం అక్కడి హిందూ సమాజానికి భద్రత కల్పిస్తుందని.. సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు తక్షణ, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని నా ప్రగాఢ ఆశ"
"వివిధ దేశాలలో, హిందువులపై హింసాత్మక చర్యలు, ద్వేషం కొనసాగుతూనే ఉన్నాయి, అయితే ఇంత జరుగుతున్నా దేశాధినేతలు, నాయకులు, అంతర్జాతీయ సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నారు. శాంతి ప్రేమికులుగా పిలుచుకునే ఎన్జీవోలు ఎందుకు వినపడనట్లుగా ఉన్నాయి? ఈ విద్వేషాన్ని ప్రశ్నించే స్వరాలు ఎక్కడ ఉన్నాయి? హిందువులకు సంఘీభావం ఎక్కడిది? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాము? ఇది కేవలం జాలి, కరుణ కోసం చేసిన విజ్ఞప్తి మాత్రమే కాదు, చర్య కోసం ఇస్తున్న పిలుపు. ప్రపంచం హిందువుల బాధలను గుర్తించాలని.. ఇతరుల పట్ల వ్యవహరించే అదే ఆవశ్యకత, నిబద్ధతతో ఈ దాడులను పరిష్కరించాలని పిలుపునిస్తున్నాం. మానవత్వం ఎప్పటికీ ఇలాంటి కరుణను అంగీకరించదు. ఏ వర్గమైనా, ఎక్కడైనా ఇలాంటి హింసకు గురైతే వారికోసం మనమంతా ఐక్యంగా నిలబడదాం" అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
మరోవైపు కెనడాలో ఖలీస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రాంప్టన్లో ఉన్న ఓ హిందూ ఆలయంపై దాడి చేశారు. ఆలయంలోని భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం దీనిపై స్పందించారు. కెనడాలో అన్ని మతాల హక్కును కాపాడతామని అన్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత విదేశాంగశాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.