శ్రీ హరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రోబా - 3 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ కు చెందిన ప్రోబా-3 మిషన్ శాటిలైట్లను నింగిలోకి పంపింది. కాగా ఈ ప్రయోగం బుధవారమే చేపట్టాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ప్రోబా3 స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని ఇస్రో గురువారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే అంతరిక్ష పరిశోధనలో రోజురోజుకు ఎంతో డెవలప్ అవుతూ, ప్రపంచ దేశాలకు సాధ్యం కాని రికార్డులను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) అందుకుంటోంది. చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ భాగంపై సురక్షిత ల్యాండింగ్ చేసి మన సత్తా ఏంటో ఇస్రో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్రమంలో ఎన్నో దేశాలు మనవైపు చూస్తున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) సైతం తమ శాటిలైట్లను ప్రయోగించాలని ఇస్రోను ఆశ్రయించింది. దీంతో ఇస్రో.. PSLV- C59 PROBA 3 మిషన్ చేపట్టింది. ఇందుకోసం ప్రోబా 3 అనే రెండు శాటిలైట్లను అభివృద్ధి చేసింది.
సూర్యుడి బయటి పొర అయిన కరోనాను స్టడీ చేసే లక్ష్యంతో పీఎస్‌ఎల్‌వీ- సీ59/ ప్రోబా 3 మిషన్ చేపట్టారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన ఈ మిషన్‌లో కరోనాగ్రాఫ్, అకల్టర్ అనే రెండు శాటిలైట్లను అమర్చింది. సుమారు 550 కిలోల బరువు ఉండే ఈ రెండు శాటిలైట్‌లో భూకక్ష్యలో తిరుగుతూ కరోనాను అధ్యయనం చేస్తాయి. భూమిపై పవర్ గ్రిడ్‌లను, కమ్యూనికేషన్ సిస్టంలకు అంతరాయం కలిగించే సౌర తుఫానులు, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల గురించి కూడా ఇవి శోధిస్తాయి. సూర్యుడి ఉపరితలం కన్నా కరోనా ఎందుకంత వేడిగా ఉంటుందనే తేల్చేందుకు ఈ ప్రయోగం బాటలు వేయనుంది. దీంతోపాటు సూర్యుడి వాతావరణం గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది.