నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెన్నైలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్’ (ఐఐటీఎం)లో శుక్రవారం జరిగిన ‘ఆలిండియా రిసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో ఆయన మాట్లాడారు. ఐఐటీఎంలో ఆద్యంతం చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. విద్యార్థులు సైతం ‘జై బాబు.. జైజై బాబు’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ, ఆయన ప్రసంగం సమయంలో హర్షధ్వానాలతో హోరెత్తించారు. ఏపీని ఏఐ, డీప్ టెక్నాలజీ హబ్‌గా మార్చుతానని విద్యార్థుల కరతాళధ్వనుల మధ్య చంద్రబాబు ప్రకటించారు. ‘‘దేశంలో 65 శాతం మంది ఏఐ వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 30 శాతం కన్నా అధికం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలో విద్యార్థులు ముందుండాలి’’ అని ఆయన సూచించారు.1991 ఆర్థిక సంస్కరణల ప్రభావాన్ని గుర్తు చేస్తూ.. ‘‘సంస్కరణలు భారత ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆర్థిక సంస్కరణలతో చైనా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బీఎ్‌సఎన్‌ఎల్, వీఎ్‌సఎన్‌ఎల్ ఆధిపత్యం ఉండేది. సంస్కరణలు రావడంతో ప్రైవేటు సంస్థలు కూడా టెలికాం రంగంలోకి వచ్చాయి. ఇదొక గేమ్ చేంజర్ అయింది. ప్రస్తుతం ప్రపంచం చూపు మనదేశం వైపు మళ్లింది. రాబోయే రోజులన్నీ భారత్‌వే.’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
![]() |
![]() |