ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తెకు 124 ఎకరాల హార్స్ ఫామ్ కానుకగా ఇచ్చిన బిల్ గేట్స్

international |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 06:53 PM

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన కుమార్తె జెన్నిఫర్ గేట్స్‌కు భారీ బహుమతి ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. 2018లో జెన్నిఫర్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆమెకు 15.82 మిలియన్ డాలర్ల భారత కరెన్సీలో సుమారు రూ. 136 కోట్లు) విలువైన గుర్రపుశాలను  కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చినట్లు న్యూయార్క్ పోస్ట్, ది జర్నల్ న్యూస్ కథనాలు ప్రచురించాయి.ఈ విలాసవంతమైన ఎస్టేట్ న్యూయార్క్‌లోని నార్త్ సేలం, వెస్ట్‌చెస్టర్‌లో ఉంది. సుమారు 124 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హార్స్ ఫామ్ లో గుర్రపు స్వారీకి అవసరమైన అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయని సమాచారం. రియల్ ఎస్టేట్ డెవలపర్, డేటన్-హడ్సన్ కార్పొరేషన్ వారసుడు అయిన డంకన్ డేటన్ నుంచి ఈ ఎస్టేట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలును ఆఫ్-మార్కెట్ డీల్ ద్వారా, గతంలో గేట్స్ కుటుంబం ఫ్లోరిడాలో ఆస్తులు కొనడానికి ఉపయోగించిన వెల్లింగ్‌టన్ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా పూర్తి చేసినట్లు సమాచారం.జెన్నిఫర్ గేట్స్ చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈక్వెస్ట్రియన్‌గా రాణించాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఆమె అభిరుచికి తగ్గట్టుగానే ఈ నార్త్ సేలం ఎస్టేట్‌లో అత్యాధునిక స్టేబుల్స్, శిక్షణా సౌకర్యాలు ఉన్నాయని తెలిసింది. కాగా, బిల్ గేట్స్ గతంలో ఫ్లోరిడాలోని వెల్లింగ్‌టన్‌లో కూడా 38 మిలియన్ డాలర్లతో మరో విలాసవంతమైన ఈక్వెస్ట్రియన్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలో మైఖేల్ బ్లూమ్‌బెర్గ్, బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ వంటి ప్రముఖులు నివసిస్తుంటారు.అయితే, కుమార్తెకు ఇంతటి ఖరీదైన బహుమతి ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ గతంలో తమ ముగ్గురు పిల్లలను (జెన్నిఫర్, రోరీ, ఫోబ్) చాలా సాధారణంగా, ఆర్థిక క్రమశిక్షణతో పెంచామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. 2024లో న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తమ కుటుంబం 'చాలా మధ్యతరగతి' వాతావరణంలో ఉండేదని, డబ్బు తమ పెంపకంలో ప్రధాన పాత్ర పోషించలేదని ఆమె తెలిపారు. "మేము వారికి అడిగినవన్నీ కొనివ్వలేదు," అని చెబుతూ, పిల్లలకు పాకెట్ మనీ ఇచ్చినా, పొదుపు చేయడం నేర్పించామని, దుబారా ఖర్చులను నివారించామని ఆమె వివరించారు. డ్యూక్ యూనివర్సిటీలో తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, "నాకు ఎప్పుడైనా సంపద వస్తే, నా పిల్లలను అలా పెంచకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను" అని మెలిండా వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో, జెన్నిఫర్ గుర్రపు స్వారీ కలను ప్రోత్సహించడానికి బిల్ గేట్స్ ఈ భారీ బహుమతి ఇచ్చినప్పటికీ, పిల్లల పెంపకం విషయంలో మెలిండా చెప్పిన నిరాడంబరత, విలువలకు ఇది పూర్తి భిన్నంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన గేట్స్ కుటుంబంలో సంపదకు, వారు పాటించే విలువల మధ్య ఉన్న సమతుల్యతపై ఈ సంఘటన కొత్త చర్చకు తెరలేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa