భారత వాయు రక్షణ వ్యవస్థ ఎస్-400ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు. మంగళవారం నాడు పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన, అక్కడ మోహరించి ఉన్న ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు. ఈ చర్య ద్వారా, పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు.భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' అనంతరం, పాకిస్థాన్ వైమానిక దళం తమ హైపర్‌సోనిక్ క్షిపణులతో అదంపూర్‌లోని ఎస్-400 వ్యవస్థను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నకిలీ వీడియోలను కూడా ప్రచారంలో పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి, అక్కడి వాయుసేన యోధులతో ముచ్చటించారు. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో చురుగ్గా వ్యవహరించిన ఈ వైమానిక స్థావరంపై గత వారం పాకిస్థాన్ దాడికి యత్నించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.ప్రధాని పర్యటనకు ముందే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేసింది. ఎస్-400 వ్యవస్థకు, బ్రహ్మోస్ క్షిపణి స్థావరానికి నష్టం కలిగించామన్న పాక్ వాదనలను తీవ్రంగా ఖండించింది. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, "పాకిస్థాన్ తమ జేఎఫ్-17 విమానాలతో మా ఎస్-400, బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలను దెబ్బతీశామని చెప్పడం పూర్తిగా అవాస్తవం. అలాగే, సిర్సా, జమ్మూ, పఠాన్‌కోట్, భటిండా, నలియా, భుజ్ వంటి మన వైమానిక క్షేత్రాలు దెబ్బతిన్నాయని కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవి" అని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa