ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజు లేదా వారానికి ఎన్ని సార్లు మలవిసర్జన చేయాలో తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 09:10 PM

మలవిసర్జనకి వెళ్లడం అనేది ప్రతిరోజూ మనం చేసే పనుల్లో ఒకటి. ఉదయం నిద్రలేవగానే చాలామంది మలవిసర్జన కోసం టాయిలెట్‌కి వెళ్తుంటారు. అయితే, ఇలా ఉదయాన్నే మలవిసర్జన చేయడం సరైనదేనా అనే సందేహం చాలామందికి వస్తుంది. మరికొందరు లేచిన చాలా సేపటి తర్వాత మల విసర్జన చేస్తుంటారు. కొంతమంది రోజుకు ఒకసారి మాత్రమే మల విసర్జన చేస్తారు,. మరికొందరు రోజుకు 2 నుంచి 3 సార్లు మల విసర్జన చేయడానికి టాయిలెట్‌కు వెళతారు. అయితే, నిపుణులు ప్రకారం రోజుకు ఎన్ని సార్లు మలవిసర్జన చేస్తే మంచిదో తెలుసా?


మలవిసర్జన


రోజుకు ఎన్నిసార్లు మలవిసర్జన చేయాలని కచ్చితమైన నియమం ఏమీ లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగత అలవాటు, శారీరక స్థితి, జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ఉదయం పూట ఒకసారి మల విసర్జన చేస్తారు. రాత్రంతా పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు ఉదయాన్నే బయటకు వెళ్లడం సాధారణంగా జరుగుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సంకేతం. కొంతమంది ఉదయం, సాయంత్రం లేదా రోజులో రెండు మూడు సార్లు మల విసర్జన చేయవచ్చు. మరికొందరు 2-3 రోజులకొకసారి మల విసర్జన చేస్తుంటారు. ఇది కూడా సాధారణ పరిధిలోనే ఉండవచ్చు.


వైద్యుల ప్రకారం రోజుకు ఎన్నిసార్లు మలవిసర్జన చేయాలి?


వైద్యులు సాధారణంగా రోజుకు మూడు సార్లు మలవిసర్జన చేయడం నుంచి వారానికి మూడు సార్లు మల విసర్జన చేయడం వరకు సాధారణంగా పరిగణిస్తారు. అంటే రోజుకు ఒక్కసారి మలవిసర్జన చేసినా ఏం ఇబ్బంది లేదు. రెండు నుంచి మూడు సార్లు చేసినా ఏం ఇబ్బంది ఉండదు. అయితే, నిర్దిష్ట సమయంలో చేయడం మంచిది. ఇది సక్రమంగా జరగకపోతే మలబద్దకం సమస్యను ఎదుర్కోవచ్చు.


మలబద్ధకం


* సాధారణ మలవిసర్జన అలవాట్లలో గణనీయమైన మార్పును గమనించినప్పుడు అది అసాధారణం కావచ్చు. అది మలబద్ధాకానికి సంకేతం కావచ్చు.


* వారానికి మూడు సార్ల కంటే తక్కువ మల విసర్జన జరగడం.


* మల విసర్జన చేసేటప్పుడు తీవ్రంగా శ్రమపడాల్సి రావడం.


* మలం గట్టిగా, పొడిగా లేదా గడ్డలుగా ఉండటం.


* మల విసర్జన పూర్తిగా జరగలేదనే భావన ఉండటం.


* పొత్తికడుపు నొప్పి లేదా ఉబ్బరం ఉండటం.


* అధిక గ్యాస్ (అపానవాయువు).


మలవిసర్జన సరిగ్గా జరగకపోతే కలిగే ప్రభావాలు


* శక్తి తగ్గడం: జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే శరీరానికి అవసరమైన శక్తి లభించదు. దీంతో మీరు రోజంతా అలసిపోయినట్లు, నీరసంగా అనిపించవచ్చు.


* మానసిక స్థితిపై ప్రభావం: పేగు ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కడుపులో అసౌకర్యంగా ఉంటే చిరాకు, ఆందోళన, అసహనం వంటివి కలగవచ్చు. ఇది మీ మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.


* ఏకాగ్రత కోల్పోవడం: కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏ పనీ సరిగా చేయలేరు. ఆలోచనలు చెదరగొట్టబడతాయి, ఏకాగ్రత లోపిస్తుంది.


* శారీరక అసౌకర్యం: కడుపు ఉబ్బరం, నొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రోజంతా ఇబ్బంది పెడతాయి.


ఆరోగ్యకరమైన మలవిసర్జన కోసం కొన్ని చిట్కాలు


* నీరు పుష్కలంగా తాగాలి: శరీరానికి తగినంత నీరు అందితే మలం మృదువుగా ఉండి, సులువుగా బయటకు వెళ్తుంది.


* పౌష్టికాహారం తీసుకోవాలి: పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు వంటి పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది జీర్ణక్రియకు సాయపడుతుంది.


* క్రమం తప్పకుండా వ్యాయామం: శారీరక శ్రమ పేగుల కదలికలను ప్రేరేపిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


* ఒత్తిడిని తగ్గించుకోవాలి: ఒత్తిడి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ధ్యానం, యోగా లేదా ఇతర విశ్రాంతి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


* సమయానికి మల విసర్జన: మీకు మల విసర్జన చేయాలని అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా టాయిలెట్‌కి వెళ్లాలి. దీన్ని ఆలస్యం చేయడం వల్ల మలబద్ధకం ఏర్పడవచ్చు.


* చివరగా మలవిసర్జన అలవాట్లలో గణనీయమైన మార్పులు లేదా మలంలో రక్తం వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa