ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ప్రయాణంలో కొత్తవాళ్లను గుడ్డిగా నమ్మొద్దు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 08:28 PM

రైలు ప్రయాణం అనేది పిల్లలకైనా, పెద్దలకైనా ఒక ఫేవరైట్ జర్నీ. ఆ ప్రయాణం కొన్ని మధురానుభూతుల్ని ఇస్తుంది. కొత్త పరిచయాలను ఏర్పరుస్తుంది. ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుంది. అయితే, అన్ని పరిచయాలూ అలా ఉండకపోవచ్చు. పైగా.. స్నేహం, ఆప్యాయత ముసుగులోనే మోసం చేసేవాళ్లు ఉంటారు! చెన్నై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. పోలీసులు సకాలంలో స్పందించకపోయుంటే, ఆమె జీవితమే తలకిందులయ్యేది..!


చెన్నైకి చెందిన ఒక మహిళ ఆగస్టు 19న తన పసికందుతో కలిసి ఢిల్లీలోని ఆనంద్ పర్వత్‌లో ఉన్న తన బంధువులను కలవడానికి రైలులో బయల్దేరింది. రైలులో జితేంద్ర కుమార్ అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. జితేంద్ర రాజస్థాన్‌లోని ఖేత్రికి చెందినవాడు. అతడి వయస్సు 32 సంవత్సరాలు. మంచివాడిగా నటిస్తూ 2 గంటల్లోనే జితేంద్ర ఆ మహిళ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఆమెను గమ్యస్థానానికి చేర్చడానికి సహాయం చేస్తానని చెప్పాడు.


 ఢిల్లీలో రైలు దిగిన తర్వాత అతడు ఆమెను ఆనంద్ పర్వత్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమె బిడ్డ కోసం దుకాణంలో బట్టలు కొంటానని చెప్పాడు. ఆమెకు రూ.150 ఇచ్చి దుకాణంలోకి వెళ్లమని చెప్పాడు. తాను బిడ్డను ఎత్తుకొని బయట వేచి ఉంటానని చెప్పాడు. బిడ్డకు బట్టలు కొనేందుకు ఆ మహిళ దుకాణంలోకి వెళ్లింది. ఆమె తిరిగి బయటకు వచ్చేసరికి జితేంద్ర, బిడ్డ ఇద్దరూ కనిపించలేదు. ఆందోళనకు గురై చుట్టూ వెతికింది. ఫలితం లేకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది.


పోలీసులు వెంటనే స్పందించారు. మహిళ ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆనంద్ పర్వత్, దాని పరిసర ప్రాంతాల్లోని 100 కంటే ఎక్కువ CCTV కెమెరాలను జల్లెడ పట్టారు. ఒక ఫుటేజ్‌లో జితేంద్ర బిడ్డను తీసుకొని వెళుతున్నట్లు కనిపించింది. అయితే, అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. నిందితుడు ఎక్కడికి వెళ్లాడో తెలుసుకునేందుకు పోలీసులు టెక్నాలజీ సాయం తీసుకున్నారు.


పోలీసులు AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ను ఉపయోగించి నిందితుడుని గుర్తించారు. కిడ్నాపర్ రాజస్థాన్‌కు చెందిన జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి పోలీసుల బృందాన్ని వెంటనే రాజస్థాన్‌కు పంపించారు. స్థానిక పోలీసుల సాయంతో, నిందితుడిని అతడి గ్రామం ఖేత్రిలో గుర్తించి అరెస్టు చేశారు.


నిందితుడు జితేంద్ర వద్ద నుంచి బిడ్డను సురక్షితంగా రక్షించారు. కిడ్నాపైన 18 గంటల్లో ఆ పసికందును తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. జితేంద్ర తాను ఈ నేరం ఒక బంధువు చెప్పడం వల్లే చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. డీసీపీ (సెంట్రల్) నిధిన్ వాల్సన్ తెలిపిన వివరాల ప్రకారం.. జితేంద్ర బంధువైన ఒక వ్యక్తి మగ సంతానం కోసం ఆరాటపడుతున్నాడు. మగ సంతానం కలగకపోవడంతో.. డబ్బు ఇస్తానని, అబ్బాయిని వెతకమని జితేంద్రకు చెప్పాడు. అతడిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. డబ్బుకు ఆశపడిన జితేంద్ర ఈ పని చేశాడని డీసీపీ నిధిన్ వాల్సన్ తెలిపారు.


అపరిచితులను గుడ్డిగా నమ్మకూడదని ఈ సంఘటన మరోసారి మనకు గుర్తుచేస్తోంది. ముఖ్యంగా రైలులో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టుకోవాలి. వారిని ఎవరికీ అప్పగించకూడదు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రైలు ప్రయాణాల్లో కొంత మంది పొరుగు వారితో మాటలు కలిపి నమ్మకం కలిగిస్తారు. తాము తినే ఆహారాన్ని షేర్ చేసుకుంటారు. కూరలో ఉప్పు తక్కువగా ఉందంటూ.. మత్తు పదార్థం కలిపిన ఉప్పు వేసి, వారు నిద్రలోకి జారుకున్న తర్వాత బంగారం, విలువైన వస్తువులతో ఉడాయించిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఇక ఒంటరిగా ప్రయాణించే మహిళలు, యువతులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు సమయానికి స్పందించడం వల్ల ఒక తల్లి తన బిడ్డను తిరిగి పొందగలిగింది. ఈ సంఘటనకు సంతోషకరమైన ముగింపు లభించింది. కానీ, డబ్బు కోసం ఒక మనిషి ఎంతకైనా తెగించే ప్రమాదం ఉంది..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa