ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ చర్యలు అమల్లోకి వస్తే రష్యా ఆర్థిక వ్యవస్థతో పాటు, ఆ దేశం నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఆదివారం వైట్‌హౌస్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సూటిగా సమాధానమిచ్చారు. "రష్యాపై రెండో దశ ఆంక్షలకు మీరు సిద్ధంగా ఉన్నారా?" అని అడగ్గా, "అవును, నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆయన బదులిచ్చారు. అయితే, ఈ ఆంక్షలు ఎలా ఉంటాయనే దానిపై ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాను అధికారంలోకి రాగానే ఉక్రెయిన్ యుద్ధాన్ని వేగంగా ముగించగలనని గతంలో ప్రకటించిన ట్రంప్, ఆ దిశగా పురోగతి లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యాను కట్టడి చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa