ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య రంగంలో ఏపీని ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలుపుతామని చంద్రబాబు ధీమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:59 PM

గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 'శంకర ఐ సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని' ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవాళికి, ముఖ్యంగా పేదలకు శంకర ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అద్భుతమని, అమోఘమని ప్రశంసించారు. అవసరమైన వారికి దృష్టిని ప్రసాదిస్తూ ఆ సంస్థ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. స్వామీజీ సమక్షంలో ఈ సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని ప్రారంభించటం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు తమిళనాడులో స్థాపించిన కంచి పీఠం.. ధర్మం, జ్ఞానం, సేవ అనే మూడు మూల సిద్ధాంతాలపై పనిచేస్తోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆనాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కంచి పీఠం ఎంతో కృషి చేస్తోందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆది శంకరాచార్యులు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు పీఠాలను స్థాపించిన విషయాన్ని ప్రస్తావించారు. 'మానవ సేవే మాధవ సేవ' అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే కంచి పీఠం, దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని అన్నారు.శంకర ఐ ఫౌండేషన్ సాధించిన విజయాలను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఐదు దశాబ్దాల ప్రస్థానంలో దేశంలోని 10 రాష్ట్రాల్లో 14 కంటి ఆసుపత్రులను నిర్మించి, విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు, 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఈ ఆసుపత్రుల్లో రోజుకు సగటున 750 ఉచిత కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిసి తాను ఆశ్చర్యపోయానని, ఇది మరే ఇతర సంస్థకు సాధ్యం కాని ప్రజా సేవ అని కొనియాడారు. కేవలం భారతదేశంలోనే కాకుండా నేపాల్, కాంబోడియా, నైజీరియా వంటి దేశాల్లోనూ సేవలందిస్తుండటం ప్రశంసనీయమన్నారు. 'గిఫ్ట్ ఆఫ్ విజన్' అనే గ్రామీణ సేవా ప్రాజెక్ట్ కింద 32,000కు పైగా కంటి శిబిరాలు నిర్వహించడం వారి నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.నూతనంగా ప్రారంభించిన ఈ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ బ్లాక్‌తో మన రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, దీని ద్వారా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా 'రెయిన్‌బో ప్రోగ్రామ్' ద్వారా చిన్నారుల కంటి ఆరోగ్యంపై దృష్టి సారించడాన్ని ఆయన అభినందించారు.ఈ సందర్భంగా తమ ప్రభుత్వ లక్ష్యాలను కూడా చంద్రబాబు వివరించారు. 'ఆరోగ్యాంధ్రప్రదేశ్' నిర్మాణంలో భాగంగా 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ' అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అనారోగ్యమే నిజమైన పేదరికం అని, అందుకే ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. ప్రజారోగ్య సంరక్షణకు వినూత్న కార్యాచరణ అమలు చేస్తున్నామని, త్వరలోనే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురానున్నామని ప్రకటించారు. ప్రముఖ టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ 'సంజీవని' కేంద్రాలను త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కాపాడటానికి శంకర ఐ హాస్పిటల్స్ వంటి సంస్థల సేవలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని అన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, పేదలకు సేవ చేసే సంస్థలకు తమ సహకారం సంపూర్ణంగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో శంకర ఐ ఆస్పత్రి నిర్వహించే స్వర్ణోత్సవాల్లో తాను కూడా పాల్గొంటానని ఆయన ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa