ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కురుబ కులస్తులపై కపటప్రేమ ఆపి, మా మానాన మమ్మల్ని వదిలెయ్యండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 12:59 PM

కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక తెలుగుదేశం నాయ‌కులు ఒక‌వైపు కురుబ కుల‌స్తుల‌ను దారుణంగా న‌రికి చంపుతూ ఇంకోవైపు శ్రీభ‌క్తక‌న‌క‌దాస‌ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ప్రేమ ఉన్న‌ట్టు న‌టిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీఅధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కురుబ కుల‌స్తుల‌ను వైయ‌స్ జ‌గ‌న్ గ‌డిచిన ఐదేళ్లు భుజాన మోస్తే, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కాలికింద వేసి తొక్కుతున్నార‌ని.. మా కుల‌స్తుల మీద క‌క్ష‌ సాధింపులు ఇప్ప‌టికైనా ఆపేసి మా మానాన మ‌మ్మ‌ల్ని బ‌తికేలా వ‌దిలేస్తే చాలని నారా లోకేశ్‌ని డిమాండ్ చేశారు. మ‌ర్డ‌ర్లు మీరే చేసి ఓదార్చ‌డానికి కూడా మీరే రావ‌డం కురుబ‌ల‌కు వెన్నుపోటు పొడ‌వ‌డ‌మేన‌ని గోరంట్ల మాధ‌వ్ మండిప‌డ్డారు. అయన మాట్లాడుతూ... కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాప్తాడులో కురుబ లింగ‌మ‌య్య‌ను, ఆలూరులో బండారు వీర‌న్న‌ను, క‌న‌గాన‌ప‌ల్లిలో ముర‌ళి అనే యువ‌కుడిని.. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు దారుణంగా న‌రికి చంపారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్న బండారు వీర‌న్న‌ను రాజీనామా చేయాల‌ని టీడీపీ నాయ‌కులు బెదిరించారు. ప‌దిరోజుల్లో చేస్తాన‌ని చెప్పినా విన‌కుండా బైపుపై వెళ్తుంటే కొడ‌వ‌ళ్ల‌తో దారుణాతి దారుణంగా నరికి చంపేశారు. తెలుగుదేశం పార్టీ అరాచ‌కాల‌ను ఎదిరించినందుకు కురుబ లింగ‌మ‌య్య‌ను కర్ర‌ల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేసి కొట్టి చంపేశారు. వారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ వెళితే కూడా కూట‌మి ప్ర‌భుత్వం ఓర్చుకోలేక‌పోయింది. దాదాపు 50 మంది కురుబ కులస్తుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించింది. క‌న‌గాన‌ప‌ల్లి హెడ్ క్వార్ట‌ర్‌లో ముర‌ళి అనే యువ‌కుడిని తెలుగుదేశం పార్టీ నాయ‌కులే దారుణంగా న‌రికి చంపితే ఆరు నెల‌లు గ‌డ‌వ‌కుండానే అత‌డి తల్లిదండ్రులు కూడా పుత్ర‌శోకంతో క‌న్నుమూశారు. ఒక‌ప‌క్క వ‌రుస‌పెట్టి కురుబ కులస్తుల‌ను తెలుగుదేశం పార్టీ నాయ‌కులు దారుణంగా నరికి చంపేస్తుంటే మంత్రి నారా లోకేశ్ మాత్రం ఏమీ ఎరుగ‌న‌ట్టు, కురుబ‌ల‌పై త‌న‌కు ప్రేమ ఉన్న‌ట్టు శ్రీభ‌క్త క‌న‌క‌దాసు జ‌యంతి సంద‌ర్భంగా విగ్ర‌హానికి దండ‌లేసి నివాళుల‌ర్పించ‌డం కురుబ‌ల‌ను అవ‌మానించ‌డ‌మే. ఇదే నారా లోకేశ్ కురుబ లింగ‌మ‌య్య వ‌ర్ధంతికి కూడా వ‌చ్చి ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించ‌డంతో పాటు వారి కుటుంబానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. అప్పుడైనా వారు చేసిన పాపం కొంచెమైనా త‌గ్గుతుందేమో. దీంతో పాటు 50 మంది కురుబల మీద న‌మోదు చేసిన అక్ర‌మ కేసుల‌ను సైతం వెంట‌నే ఎత్తివేయాలని గోరంట్ల మాధ‌వ్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa