ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్మా నదిపై కొత్త బ్యారేజీతో భారత్‌కు బంగ్లాదేశ్ సవాల్

international |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 09:17 PM

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫరక్కా నీటి ఒప్పందం పునరుద్ధరణపై చర్చలు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ మరో బ్యారేజీ నిర్మాణానికి సిద్ధమవుతుండటం భారత్ దృష్టిని ఆకర్షించింది. బంగ్లాదేశ్ వాటర్ డెవలప్‌మెంట్ బోర్డు (BWDB) సుమారు రూ.50,443. 64 కోట్ల ఠాకాలతో పద్మా బ్యారేజీ ప్రాజెక్టును చేపట్టనుంది. బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే గంగా నది భాగమే పద్మా నది. భారత్, బంగ్లాదేశ్ మధ్య 1996లో జరిగిన ఫరక్కా జలాల ఒప్పందం 2026లో పునరుద్ధరణకు రానుంది. అయితే, ఆగస్టు 2024 నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో చర్చలు నెమ్మదిగా సాగుతున్నాయి.


బంగ్లాదేశ్ డ్రై సీజన్‌లోనూ నీటి సరఫరాకు హామీ కోరుతుండగా, భారత్ తన అవసరాలకు అనుగుణంగా ఒప్పందాన్ని మార్చుకోవాలని చూస్తోంది. ప్రాంతీయ రాజకీయాలు, వాతావరణ మార్పులు, పశ్చిమ బెంగాల్ నీటి అవసరాలు ఈ చర్చలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఫరక్కా ఒప్పందంలోని అంశాలను ఇరు దేశాలు విభేదిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ పద్మా బ్యారేజీ నిర్మాణానికి సిద్ధమవడం, తమంట తామే చర్యలు తీసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.


బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్, దేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యలను ప్రస్తావించారు. గురువారం ఆయన ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ప్రెసిడెంట్ జియావుర్ రెహమాన్ కాలంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా కాలువలు నిర్మించడాన్ని మనం చూశాం. ఆ కాలువల నిర్మాణం ద్వారా రైతులకు సాగునీరు అందించడమే కాకుండా, ప్రజల నీటి సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎన్పీ గెలిచి, అధికారం చేపడితే మళ్లీ కాలువల నిర్మాణం చేపడతామని, నదుల్లో నీటి లభ్యతను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ‘గత 15-16 ఏళ్లుగా ఈ దేశ ప్రయోజనాలు ఎలా తాకట్టు పెట్టారో మనం చూశాం. అందుకే ఢిల్లీ కాదు, పిండి ( పాక్ రావల్పిండి) కాదు, ఏ ఇతర దేశం కాదు.. ముందు బంగ్లాదేశ్’ అని తారిఖ్ రెహమాన్ పేర్కొన్నారు.


బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారత్‌తో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలలో ఫరక్కా జలాల ఒప్పందం పునరుద్ధరణ ఒకటి. 1996లో 30 ఏళ్ల కాలానికి సంతకం చేసిన ఈ ఒప్పందం ఇప్పుడు పునఃపరిశీలనకు రానుంది. ఫరక్కా బ్యారేజీ వద్ద నీటి విడుదల, నిల్వపై ఇరు దేశాలు తరచుగా విభేదిస్తున్నాయి. 2024లో బంగ్లాదేశ్‌లో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదలకు పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజీ గేట్లు తెరవడమే కారణమని బంగ్లాదేశ్‌ ఆరోపించింది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించి, వాస్తవాలను గ్రహించాలని కోరింది. ఫరక్కా కేవలం ఒక బ్యారేజీ మాత్రమేనని, డ్యామ్ కాదని, నీటి మట్టం పెరిగినప్పుడు వచ్చే నీరంతా ప్రవహిస్తుందని భారత్ వివరించింది. గంగా/ పద్మా నదిపై గేట్లను ఉపయోగించి 40,000 క్యూసెక్కుల నీటిని ఫరక్కా కాలువలోకి మళ్లిస్తామని, మిగిలింది బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుందని భారత్ తెలిపింది.


భారత్ నిర్మించిన ఫరక్కా బ్యారేజీ వల్ల గంగా నదిలో నీటి ప్రవాహం తగ్గిందని, అందుకే పద్మా బ్యారేజీ అవసరం పెరిగిందని బంగ్లాదేశ్ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు ఫరక్కా బ్యారేజీకి సుమారు 180 కిలోమీటర్ల దిగువన, కుష్టియా జిల్లాలోని పాంగ్షాలో నిర్మించే అవకాశం ఉంది. BWDB పత్రాల ప్రకారం, ఫరక్కా బ్యారేజీ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి బంగ్లాదేశ్ నైరుతి ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. 1996 గంగా నీటి పంపిణీ ఒప్పందం ప్రకారం... జనవరి 1 నుంచి మే 31 వరకు ఇరు దేశాలు ఫరక్కా వద్ద నది ప్రవాహాన్ని పంచుకుంటాయి. అయితే, ఈ 30 ఏళ్ల ఒప్పందాన్ని ప్రస్తుతం దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలో పునఃసమీక్షించాల్సి ఉంది.


భారత్ సూచనలను బంగ్లాదేశ్ వ్యతిరేకించింది. 1977లో అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ ఫరక్కా బ్యారేజీ సమస్యను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ప్రస్తావించారు. ఇరు దేశాలూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సూచించింది. 1977 నవంబర్‌లో అప్పటి భారత ఉపప్రధాని బాబు జగజీవన్ రామ్ బంగ్లాదేశ్‌లో సందర్శించి, ఫరక్కా సమస్యను పరిష్కరించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశారు. 1996లో, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ఫరక్కా బ్యారేజీ వద్ద ఉపరితల జలాల పంపిణీ నిర్దారణకు గంగా నీటి ఒప్పందం కుదిరింది.


పద్మా బ్యారేజీ ద్వారా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి, దేశంలోని నైరుతి, ఈశాన్య ప్రాంతాలకు ఏడాది పొడవునా జలాలను అందించవచ్చని బంగ్లాదేశ్ విశ్వసిస్తోంది. బంగ్లాదేశ్‌లోని దాదాపు 37% ప్రాంతాలకు ఈ బ్యారేజీ ప్రయోజనం చేకూరుస్తుందని, 1996 ఒప్పందం ప్రకారం నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని బంగ్లాదేశ్ అంటోంది. ఈ ప్రాజెక్టు సుమారు ఏడు నుంచి ఎనిమిది నదులకు నీటి సరఫరాను నిర్ధారించగలదని, డ్రై సీజన్‌లోనూ తగ్గిన నీటి వ్యవస్థలను పునరుద్ధరించగలదని బంగ్లాదేశ్ భావిస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు దేశీయంగా నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. చైనా వంటి విదేశీ రుణాల కోసం తర్వాత దశలో ప్రయత్నించే అవకాశం ఉంది.


బంగ్లాదేశ్‌తో కలిసి తీస్తా మాస్టర్ ప్లాన్ అమలులో కూడా చైనా భాగస్వామిగా ఉంది. ఇటీవల చైనా రాయబారి యావో వెన్.. పశ్చిమ బెంగాల్‌లోని వ్యూహాత్మక సిలిగురి కారిడార్‌కు సమీపంలో ఉన్న ఉత్తర బంగ్లాదేశ్‌ను సందర్శించడం భారత్ నిశితంగా గమనిస్తోంది. రంగపూర్‌లోని భారత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని వెన్ సందర్శించారు. ఆయనతో పాటు తాత్కాలిక ప్రభుత్వంలో బంగ్లాదేశ్ నీటి వనరుల సలహాదారు సైదా రిజ్వానా హసన్ కూడా ఉన్నారు.


సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే తీస్తా నది నీటి పంపిణీకి సంబంధించిన సుదీర్ఘ ఒప్పందాన్ని భారత్, బంగ్లాదేశ్‌లు ఇంకా ఖరారు చేయలేకపోయాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. తీస్తా నీటిని పంచుకుంటే, ఉత్తర బెంగాల్‌కు తాగునీరు కూడా అందదని, సాగునీటికి అవకాశం ఉండదని ఆమె అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa