తలుపులు మూసేసి ఏపీని విభజించారని కాంగ్రెస్ పై మరోమారు ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాల విభజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సొంత నేతలనూ వాళ్లు పట్టించుకోలేదని, సభలో మైకులు కట్ చేశారని, డోర్లు మూసేసి ఏపీని విభజించారని అసహనం వ్యక్తం చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి కూడా మూడు రాష్ట్రాలను విభజించినా.. శాంతియుత వాతావరణంలో రాష్ట్రాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణను తాము వ్యతిరేకించడం లేదని, కానీ, శాంతియుతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని మాత్రమే అంటున్నామని పేర్కొన్నారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. దేశానికి, ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు ప్రమాదకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మహాత్మా గాంధీనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వద్దారని గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్ అనేదే లేకుంటే ఆత్యయిక పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. సిక్కుల ఊచకోత జరిగేది కాదు. అవినీతి అన్నదే భారత్ లో ఉండకపోయేది. కశ్మీరీ పండిట్ల వలసలు జరిగేవి కాదు. ఆడబిడ్డలు క్షేమంగా ఉండేవారు. ప్రజలందరికీ కనీస వసతులు వచ్చేవి’’ అని అన్నారు. 1955లో గోవాలో పాదయాత్ర చేస్తున్న సత్యాగ్రహిల మరణానికి జవహర్ లాల్ నెహ్రూనే కారణమన్నారు. అంతర్జాతీయంగా తన ఇమేజ్ ను కాపాడుకునేందుకు గోవాను వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు చాలా విషయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మొత్తం ఇప్పుడు అర్బన్ నక్సలైట్లతో నిండిపోయిందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను వారే కబ్జా చేశారని, చరిత్రను మార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలు పురోగమించినప్పుడే దేశం పురోగమిస్తుందన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రులను అవమానించారని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావడం వల్ల.. ముస్లిం పురుషులకు తమ కూతుర్ల భవిష్యత్ పై భరోసా నింపామన్నారు. బడ్జెట్ లో తాము పన్నులను పెంచలేదని మోదీ గుర్తు చేశారు. భారత సాంప్రదాయ ఔషధాలను విదేశాల్లో గుర్తిస్తున్నారన్నారు. ఇప్పటికే దేశంలో 80 వేల ఆరోగ్య కేంద్రాలను ఆయుష్ ఆధ్వర్యంలో నిర్మించామన్నారు. కరోనా నిర్మూలన వ్యూహాలపై ఏర్పాటు చేసిన సమావేశాన్ని బాయ్ కాట్ చేయడం ద్వారా ప్రతిపక్షాలకే నష్టం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో 23 సార్లు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశమయ్యానని ఆయన గుర్తు చేశారు. వ్యాక్సిన్లకు ఖర్చు చేస్తున్న డబ్బులన్నీ వృథా అని ఓ ఎంపీ అన్నారన్నారు. అసలు ప్రతిపక్షాలకు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సాధించిన గొప్ప విజయంపై కనీస గౌరవం కూడా లేదన్నారు. ప్రతిపక్షాలు దేశానికి మకిలీ అంటించే పనిలో బిజీగా ఉండిపోయాయన్నారు. యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉండేదని గుర్తు చేశారు. అయితే, తమ హయాంలో అది కేలం 4 నుంచి 5 శాతమే ఉందన్నారు. గత ఏడాది చాలా యూనికార్న్ లను సృష్టించామని, ఐటీ రంగంలో 27 లక్షల ఉద్యోగాలను కల్పించామని అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత నియామకాలు రెట్టింపయ్యాయన్నారు. ప్రస్తుతం రక్షణ రంగంలోకి ఎంఎస్ఎంఈలూ ప్రవేశిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైల్ ఫోన్లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్ అని, అందులోనూ ఎంఎస్ఎంఈలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. వ్యవసాయాన్ని గాడిలో పెట్టామన్నారు. కనీస మద్దతు ధర రైతుల ఖాతాల్లోనే పడేలా తొలిసారి చర్యలు చేపట్టామన్నారు. యువత.. దేశ భవితను ప్రపంచం ముందు అంతెత్తులో నిలుపుతున్నారని కొనియాడారు. స్టార్టప్ ల ఏర్పాటులో దేశాన్ని ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిపారన్నారు. క్రీడల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. మనం ఇప్పటిదాకా చేసిన తప్పులను సరిదిద్దుకుని వందో స్వాతంత్ర్యం నాటికి దేశ పురోగతికి కావాల్సిన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa