తన చేతుల్లోకి ట్విట్టర్ పూర్తి స్థాయిలో వస్తే తాను ఏం చేయబోతాడో వివరించాడు ఎలాన్ మాస్క్. ట్విట్టర్ ను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పటికే బోర్డు డైరెక్టర్లు.. మస్క్ కు కంపెనీని అప్పగించేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. ‘‘నేను అనుకున్నదిగానీ జరిగితే బోర్డు వేతనం సున్నా డాలర్లు అయిపోతుంది. దాని వల్ల ఏడాదికి 30 లక్షల డాలర్లు ఆదా అవుతాయి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల మస్క్ ట్విట్టర్ లో 9.1 శాతం వాటాను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తద్వారా సంస్థలో రెండో అతిపెద్ద వాటాదారుగా ఆయన నిలిచారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్ ను కొంటానని బోర్డు డైరెక్టర్లకు ఆయన ఆఫర్ ఇచ్చారు. 4,300 కోట్ల డాలర్ల ఆఫర్ ను ప్రకటించారు. అయితే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే తన ఫాలోవర్లు, షేర్ హోల్డర్లను ఉద్దేశిస్తూ.. ట్విట్టర్ షేర్ ముఖ విలువను 54.2 డాలర్లకు చేర్చేది షేర్ హోల్డర్లేనని, బోర్డు కాదని అన్నారు.
అయితే, మస్క్ కు చెక్ పెట్టేందుకు సంస్థ వాటాదారుల్లో ఎవరైనా 15 శాతం వాటా తీసుకోకుండా ఉండడాన్ని నివారించేందుకు బోర్డు.. షేర్లను రిబేటు మీద అమ్మేందుకు నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ నెటిజన్లు ట్వీట్ చేస్తుండడంతో.. మస్క్ రిప్లై ఇచ్చారు. కంపెనీ తన చేతుల్లోకి వస్తే బోర్డు డైరెక్టర్లెవరికీ పైసా దక్కదని స్పష్టం చేశారు.