కొన్ని సన్నివేశాలు చిత్రాలు చూడటమే కాదు ఇపుడు వాటిని నిజజీవితంలో చూస్తున్నాం. అలాంటిదే ఇటీవల ఓ ఘటన చోటు చేసుకొంది. ముంబైలోని ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడల్లో దాచిపెట్టిన నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. ఆ సంస్థ అనుమానిత లావాదేవీలను గుర్తించిన అధికారులు తొలుత కార్యాలయంలో సోదాలు చేశారు. అక్కడేమీ లభించకపోవడంతో గోడలను, నేలను తవ్వి చూడగా ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు రూ. 10 కోట్ల విలువైన నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కల్బాదేవి ప్రాంతంలో చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం ఉంది. ఇటీవల ఈ కంపెనీ టర్నోవరు అకస్మాత్తుగా పెరగడాన్ని మహారాష్ట్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. గత మూడేళ్లలో చాముండా బులియన్ టర్నోవరు రూ. 23 లక్షల నుంచి ఏకంగా రూ. 1,764 కోట్లకు పైగా పెరగడం అధికారుల్లో అనుమానాలు రేకెత్తించింది.
దీంతో అధికారులు కల్బాదేవి సహా మూడు ప్రాంతాల్లో ఆ సంస్థకు ఉన్న కార్యాలయాలపై నిన్న దాడులు చేశారు. కల్బాదేవిలో ఉన్న కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో తొలుత ఏమీ లభించలేదు. అయితే, గదిలో నేలపై ఉన్న టైల్స్ అమరికలో ఓ మూల కొద్దిగా తేడా కనిపించడంతో అధికారులు అనుమానించారు. దీంతో అక్కడికెళ్లి ఒక టైల్‌ను తొలగించి చూసి ఆశ్చర్యపోయారు. నగదు కుక్కిన గోనె సంచులు కనిపించడంతో వెలికి తీశారు. తీస్తున్న కొద్దీ బయటపడుతుండడంతో అధికారులు నోరెళ్లబెట్టారు.
ఈ సంచుల సంగతేంటని యజమాని, అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వాటి గురించి తమకేమీ తెలియదని చెప్పారు. దీంతో గదిని తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి గదిని పరిశీలించి రహస్య అరలను గుర్తించారు. అనంతరం వాటిని తెరవగా రూ.9.8 కోట్లున్న నగదు నింపిన గోనె సంచులు, రూ. 13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభ్యమయ్యాయి. కంపెనీపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.