బలూచిస్థాన్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ఉనికిని సహించబోమని స్పష్టమైన సందేశాన్ని అందించేందుకే మహిళా ఉగ్రవాది కరాచీలోని చైనీయులపై దాడికి పాల్పడిందని తేలింది. కరాచీలో చైనా జాతీయులపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాదికి సంబంధించి ఇలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు చైనా జాతీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆ ఉగ్రవాది పేరు షరీ బలూచ్. వయసు 30 సంవత్సరాలు. బలూచిస్థాన్‌లోని టుర్బాట్‌లోని నియాజర్ అబద్‌కు చెందిన షరీ ఉన్నత విద్యావంతురాలు. జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఓ వైద్యుడిని పెళ్లాడిన ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ దాడికి బాధ్యత ప్రకటించిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) విడుదల చేసిన ఉగ్రవాది వివరాల ప్రకారం.. షరీ ప్రస్తుతం ఎంఫిల్ చేస్తోంది. అంతేకాదు, సైన్స్ టీచర్‌గానూ చేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్ ప్రత్యేక బలిదాన దళంలో చేరింది. అయితే, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండడంతో ఈ దళం నుంచి తప్పుకునేందుకు అవకాశం వచ్చినా అందుకు ఆమె నిరాకరించింది. ఇప్పుడీ మజీద్ బ్రిగేడ్ బలూచిస్థాన్, పాకిస్థాన్‌లలోని చైనా జాతీయులను, చైనా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించింది.
బీఎల్ఏ ప్రతినిధి జీయాంద్ బలూచ్ మాట్లాడుతూ.. చైనా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విస్తరణకు చిహ్నమైన కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, అధికారులను లక్ష్యంగా చేసుకోవడం, బలూచిస్థాన్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ఉనికిని సహించబోమని స్పష్టమైన సందేశాన్ని అందించేందుకే ఈ దాడికి పాల్పడిందని పేర్కొన్నారు. బలూచ్‌లో మారణహోమం చేపట్టడంలో పాకిస్థాన్‌కు సైనికపరంగా, ఆర్థికంగా సాయం చేయొద్దని చైనాను పలుమార్లు హెచ్చరించినట్టు చెప్పారు. అయినప్పటికీ చైనా ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టిందని, బలూచిస్థాన్‌లో విస్తరణ కార్యకలాపాల్లో పొల్గొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.