‘‘చదువు అనేది గొప్ప ఆస్తి.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి. తలరాతలు మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. చదువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ చరిత్రను, ఒక సామాజిక చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని నమ్మే వ్యక్తిని నేను. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చడం సంతోషంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో జగనన్న విద్యాదీవెన నగదు జమ కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. జగనన్న విద్యా దీవెన పథకం 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి 10.85 లక్షల మంది విద్యార్థులకు గానూ వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను సీఎం వైయస్ జగన్ జమ చేశారు. ఇప్పటి వరకు విద్యా దీవెన కింద రూ.10,994 కోట్లు వెచ్చించామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. తిరుపతి తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అక్కచెల్లెమ్మలను, విద్యార్థులను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.