రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒకవైపు విధ్వంసం.. మరోవైపు బాదుడు.. ఇంకో వైపు అప్పులు వెంటాడుతున్నాయన్నారు. టీడీపీ ముందు జగన్ ఒక బచ్చా.. వైఎస్సార్‌సీపీ తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదన్నారు. ఏపీలో ప్రతి ఇంటికి జగన్ బాదుడే బాదడు రీచ్ అయ్యిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో సహా అంతా బాదుడే బాదుడు బాధితులని.. కర్నూలు మీటింగ్ చూస్తుంటే మహానాడును తలపించే విధంగా ఉందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అధినేత చంద్రబాబు వారికి దిశా నిర్దేశం చేశారు. టీడీపీని కాలగర్భంలో కలపాలి అనుకున్న వారే కనుమరుగు అయ్యారని పేర్కొన్నారు.
కర్నూలులో టీడీపీ జెండాలు ఎందుకు తొలగించారు.. కడప ఎయిర్‌పోర్టులోకి కార్యకర్తలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి అచ్చెన్నాయుడు వరకు అందరినీ కేసులతో వేధించారని.. అక్రమ కేసులకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కుంగిపోలేదని.. ధైర్యంగా పోరాడారన్నారు. కార్యకర్తలపై కేసులు పెడితే చూసుకుంటా.. భయపడాల్సిన పని లేదన్నారు. తప్పుడు లెక్కలకు సీబీఐకి అడ్డంగా దొరికిన జగన్ తనపై మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. ప్రజలకు ఈ పాలనపై ఫ్రస్టేషన్ ఉందన్నారు
వైఎస్ చనిపోతే 5 ఏళ్లు ఓదార్పు చేసిన జగన్.. నంద్యాల సలాం కుటుంబాన్ని గెస్ట్ హౌస్ కు పిలిపిస్తారా అంటూ మండిపడ్డారు. కార్యకర్తలకు ఏదైనా జరిగితే ప్రాణం పెట్టి కాపాడుకుంటానని.. తెలుగు దేశం రాష్ట్రంలో ఇప్పుడు అందరికీ ఒక ఆశగా కనిపిస్తుందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పెట్రో, లిక్కర్ ధర ఎంత.. రాష్ట్రంలో ఎంత అని ప్రశ్నించారు. జగన్ తెచ్చిన మద్యం బ్రాండ్స్ దేశంలో మరెక్కడా లేవని.. జె బ్రాండ్స్ తయారు చేసేది జగనే.. అమ్మేది ఆయనే.. కమిషన్ ఆయనదే అన్నారు. ఇసుక కొరత ఎందుకు వచ్చింది.. రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.