ఓ పెళ్లైన వ్యక్తితో అక్క వివాహేతర సంబంధం పెట్టుకోగా అది చెల్లెలి కొత్త జీవితంలో నిప్పులు పోసింది. ప్రియురాలితో పాటు ఆమెతో తనకు పుట్టిన కుమార్తె హత్యకు ఓ వ్యక్తి పన్నాగం పన్నాడు. అయితే అది బెడిసి కొట్టింది. కొత్తగా పెళ్లైన వారింట విషాదం నింపింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గుజరాత్లో నవసారీ జిల్లాలోని ఓ గ్రామంలో లతీష్ అనే యువకుడికి పక్క ఊరికి చెందిన సల్మా అనే యువతితో శనివారం వివాహం జరిగింది. వధూవరులిద్దరూ కొత్త జీవితం సంతోషంగా మొదలు పెట్టారు. ఇక వధువు సల్మా అక్క జాగృతికి పెళ్లి కాలేదు. ఆమెకు రాజేష్ పటేల్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రిందట చనువు ఏర్పడింది. 2009 నుంచే వారిద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలున్న రాజేష్ కారణంగా జాగృతి గర్భం దాల్చింది. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం వారి కుమార్తెకు ఆరేళ్లు. ఇటీవల రాజేష్, జాగృతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక తమ మధ్య సంబంధం బయటకు తెలిస్తే పరువు పోతుందని రాజేష్ భావించాడు. ప్రియురాలు జాగృతితో పాటు తమకు పుట్టిన కుమార్తె హత్యకు ప్లాన్ చేశాడు.
డైనమైట్ సంపాదించి, దానిని టెడ్డీబేర్‌లో బాంబుగా ఫిట్ చేశాడు. సల్మా-లతీష్ దంపతులకు పెళ్లి గిఫ్ట్‌గా పంపించాడు. దానిని తన ప్రియురాలు జాగృతికి ఇవ్వాలని ఓ వ్యక్తికి సూచించాడు. గిఫ్ట్ అందుకున్న జాగృతి దానిని వధూవరులుండే గదిలో పెట్టేసింది. పెళ్లికి వచ్చిన గిఫ్ట్‌లను ఓపెన్ చేస్తున్న క్రమంలో రాజేష్ పంపించిన బాక్సును లతీష్ విప్పి చూశాడు. ఒక్కసారిగా అది పేలడంతో అతడి చెయ్యి తెగి పడింది. లతీష్తో పాటు అతడి మేనల్లుడు జియాంష్ బాంబు పేలుడుతో తీవ్రంగా గాయపడ్డాడు. వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు పెట్టిన రాజేష్‌ను, అతడికి డైనమైట్ సమకూర్చిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు.