మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్. ఒకప్పుడు ఇది లేకపోతే వెబ్ బ్రౌజింగ్ సాధ్యమయ్యేదే కాదు. కానీ, నేడు దీన్ని వాడే వారే లేరు. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ దెబ్బకు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ పడకేసింది. ఒక దశలో ఒపెరా సైతం మైక్రోసాఫ్ట్ కు గట్టిపోటీనిచ్చింది. ఏదేమైనా ఈ పోటీలో మైక్రోసాఫ్ట్ వెనుకబడిపోయింది.
1995-2005 మధ్య దీని హవా నడిచింది. 1995 నుంచి 2013 వరకు 11 వెర్షర్లను మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసింది. 27 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ గుడ్ బై చెప్పేసింది. దీనికి గుర్తుగా దక్షిణ కొరియాకు చెందిన ఓ ఇంజనీర్ జుంగ్ కీ యంగ్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కు సమాధి నిర్మించాడు. ఇందుకోసం సుమారు రూ.25,000 ఖర్చు చేశాడు.
సమాధిపై ఓ బ్లాక్ గ్రానైట్ రాయిని పెట్టాడు. దానిపై ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లోగో.. దాని కింద ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ పుట్టిన తేదీ, మరణించిన తేదీ రాశాడు. అంటే ఆరంభమైన, ముగిసిన అని అర్థం. ‘ఇతర బ్రౌజర్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు అదొక మంచి టూల్’ అని దానిపై చెక్కించాడు. దక్షిణ కొరియాలోని గియాంగ్జు పట్టణంలో ఈ దృశ్యం కనిపించింది. ఆలోచన వినూత్నంగా ఉంది కదా..? కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ ఇన్ బిల్ట్ గా వచ్చేది కనుక ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ సుపరిచితమే.