తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో హైలెట్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వైరముత్తు పుట్టినరోజు కారణంగా తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా అతడి ఇంటికి వెళ్లి మరి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో చిన్మయి అసహనం వ్యక్తం చేసింది.లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్నో అవార్డులు అందుకున్న నేను వైరముత్తు పై ఆరోపణలు చేసినందుకు 2018 నుండి తమిళ చిత్రసీమలో బ్యాన్ ఎదుర్కొంటున్నాను.
5 ఏళ్ళ నుంచి న్యాయం కోసం పోరాడుతూ ఎన్నో సమస్యలు పడుతున్నాను. కవి మాత్రమే కాదు కీచకుడు అయిన వైరముత్తు దశాబ్దాల క్రితమే జన్మించాడు. అతను ఏ స్త్రీ పైన అయినా చేయి వేయగలడనే ధైర్యంతో ఉన్నాడు అంటూ ఆమె ఒకింత తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయం ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని నన్ను మరియు చాలా మంది మహిళలను కొంతమంది ప్రజలు అడుగుతుంటారు.
ఎందుకంటే అతడికి రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది. వారి అండతోనే అతను అనేక పద్మ అవార్డులు సాహిత్య నాటక అకాడమీ అవార్డుతో పాటు బహుళ జాతీయ అవార్డులను అందుకున్నాడు.
ఇది ఆ మనిషికి ఉన్న బలం. అందువల్లే వైరముత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వారంతా మౌనంగా ఉంటారు. అద్భుతమైన సంస్కృతి ఉన్న తమిళనాట గడ్డ పై ఇలాంటి వ్యక్తి పుట్టినరోజుని ఘనంగా జరుపుతున్న వారిలో సున్నితత్వం, సానుభూతి, విద్య అవగాహన శూన్యం. బ్రిజ్ భూషణ్ నుండి వైరముత్తు వరకు అందర్నీ రాజకీయ నాయకులు కాపాడుతూ ఉంటారు. ఈ భూమి పై కనీస న్యాయం అనేది అసలు దొరకనప్పుడు మరేతర సమస్యలు గురించి మాట్లాడడం అనవసరం అంటూ ఆవేదనని వ్యక్తం చేసింది చిన్మయి. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.