విక్రమ్ సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న కమల్ ప్రస్తుతం ‘ఇండియన్2’, తెలుగులో ‘కల్కి 2898ఎడి’, వినోద్ దర్శకత్వంలో ‘కమల్‌హాసన్ 233’, మణిరత్నం దర్శకత్వంలో ‘కమల్ 234’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘నాకు 20-21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావడం లేదని, తగినంత గుర్తింపు లభించడం లేదని బాధ పడ్డాను. నేను చనిపోతే.. ఎంతో ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని చిత్రపరిశ్రమ బాధపడుతుందని భావించాను. నా గురువు అనంతుకు కూడా ఇదే విషయం చెప్పాను. ఆయన నీ పని నువ్వు చేసుకుంటూ పో.. సరైన సమయం వచ్చినప్పుడు ఆ గుర్తింపు దానంతటదే వస్తుందని ధైర్యం చెప్పారు. ఆయన మాటలు విన్నాక ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. హత్య ఎంత నేరమో ఆత్మహత్య కూడా అంతే నేరం, పాపం. చీకటి అనేది జీవితంలో శాశ్వతంగా ఉండిపోదు. ఎలాంటి వ్యక్తి జీవితంలోనైనా ఏదో ఒక సమయంలో వెలుగు వస్తుంది. చీకటిని అంతం చేస్తుంది. అబ్దుల్ కలాంగారు చెప్పినట్లు నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు కల అంటే.. మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేదే అసలైన కల. చావు అనేది కూడా జీవితంలో ఒక భాగమే.. కానీ దాని కోసం మనం ఎదురుచూడకూడదు. రాత్రి నిద్రకు ముందు మీ కలను, లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి? అది నెరవేరుతుందా? లేదా? అన్నది పక్కన పెట్టండి. దానికోసం ఏం చేయాలి అన్నది ఆలోచించండి’’ అని ఆ సభలో కమల్ ప్రసంగించారు.