ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం నుంచి మూడో తరం సినిమాల్లోకి అడుగుపెట్టింది. మంచు విష్ణు నిర్మిస్తున్న 'కన్నప్ప' సినిమాలో ఆయన కుమారుడు అవ్రామ్, కుమార్తెలు అరియానా, వివియానాలు నటిస్తున్నారు. ఇప్పటికే అవ్రామ్ లుక్ ను రిలీజ్ చేశారు. తాజాగా 'కన్నప్ప' చిత్రంలో అరియానా, వివియానాల ఫోటోలను విష్ణు షేర్ చేశారు. వీరిద్దరి పుట్టినరోజు సందర్భంగా వీరి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ''కన్నప్ప' సినిమాలో అరియానా, వివియానాల ఫొటోలను షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నా చిన్ని తల్లులు స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ ను అందరూ ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నా. హ్యాపీ బర్త్ డే అరి, వివి' అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.మరోవైపు ఎక్స్ వేదికగా మోహన్ బాబు స్పందిస్తూ... తన మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నటనపై వాళ్లకున్న అభిరుచి తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఇండస్ట్రీలో వారికి గుర్తింపు రావాలని, ఎంతోమందిలో వారు స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు.