కాంగ్రెస్‌కు కొత్త కష్టం.. ఆ స్థానంలో సొంత పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దని ప్రచారం
 

by Suryaa Desk | Thu, Apr 25, 2024, 09:08 PM

దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల హడావుడి నడుస్తోంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు తమ ప్రచారంలో మునిగిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలుకుంటే ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు.. అంతా ఎన్నికల రణక్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద చిక్కు వచ్చి పడింది. తమ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ స్థానంలో హస్తం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తోంది. ఇది కాస్తా దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది.


ఎస్టీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానమైన రాజస్థాన్‌లోని బన్స్వారా-దుంగార్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అరవింద్ దామోర్‌ పోటీ చేస్తున్నారు. గిరిజనులు అధికంగా ఉండే ఈ బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ.. అరవింద్ దామోర్‌కు ఓటు వేయకూడదని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది. దీనికి కారణం ఒకటి ఉంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీకి ఒక రోజు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నియోజకవర్గంలో భారత్ ఆదివాసీ పార్టీ-బీఏపీ తరఫున పోటీ చేస్తున్న రాజ్‌కుమార్ రోట్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.


ఈ నేపథ్యంలోనే బీఏపీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన అరవింద్ దామర్‌ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని హస్తం పార్టీ నేతలు సూచించారు. అయితే అందుకు ఒప్పుకోని అరవింద్ దామర్.. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ముగిసే వరకు అదృశ్యం అయ్యారు. గడువు ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన అరవింద్ దామర్.. జరిగిన పరిణామాలేవీ తనకు తెలియనట్లు నటిస్తూ ఈ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు.


దీంతో బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ, బీఏపీ మధ్య ఉన్న ద్విముఖ పోరు కాస్తా బీజేపీ, బీఏపీ, కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ దామర్‌ మధ్య త్రిముఖ పోరుగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ బీఏపీకి మద్దతు ఇస్తుండగా.. అదే పార్టీ నుంచి అరవింద్ దామర్ పోటీ చేస్తుండటంతో హస్తం పార్టీ ఓట్లను ఆయన చీల్చే అవకాశం ఉందంటూ స్థానిక కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది కాస్తా.. బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాల్వియాకు ప్రయోజనం చేకూరి ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక దిక్కుతోచని స్థితిగా మారేలా కనిపిస్తోంది. బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి.


Latest News
NTR changed the course of history: CM Chandrababu Naidu Sun, Jan 18, 2026, 02:52 PM
Six killed as fire erupts at shopping mall in Pakistan's Karachi Sun, Jan 18, 2026, 02:48 PM
Amway India's loss widens to Rs 74.25 crore in FY25 Sun, Jan 18, 2026, 02:03 PM
Anti-BJP posters appear in Singur, ahead of PM Modi's public meeting Sun, Jan 18, 2026, 01:54 PM
Flash flooding, landslides prompt evacuations in Sydney Sun, Jan 18, 2026, 01:51 PM