by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:52 AM
ముంబయి, రాంచీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి.మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి హవా కొనసాగుతోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (145) దాటేసింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. అటు ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జేఎంఎం కూటమి జోరు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (41) దాటింది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం..
మహారాష్ట్రలో మహాయుతి కూటమి 218 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 55 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం.
ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి 43, భాజపా నేతృత్వంలోని కూటమి 27 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 41.
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ భాజపా నుంచి నవ్య హరిదాస్ పోటీ చేశారు.
బర్‌హైత్‌లో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండేలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్ సౌత్ వెస్ట్‌లో భాజపా అభ్యర్థి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆధిక్యంలో ఉన్నారు.
బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ముందంజలో కొనసాగుతున్నారు.
వర్లీలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు.
కోప్రిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ముందంజలో కొనసాగుతున్నారు.
వాండ్రే ఈస్ట్‌లో బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్ (ఎన్సీపీ) ఆధిక్యంలో ఉన్నారు.
Latest News