by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:12 PM
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుకుమా జిల్లా బెజ్జి అడవుల్లో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య సుమారు ఐదు గంటల పాటు సాగిన ఎదురు కాల్పుల్లో 10మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో దక్షిణ బస్తర్ మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు, మిలటరీ ఇన్‌చార్జి(డీవీసీఎం) మాసాతోపాటు ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. సుకుమా జిల్లా బెజ్జి పోలీ్‌సస్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్ కలిసి సుమారు 600మంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.
కొర్రాజుగూడ, భందరపర గుట్టల్లో శుక్రవారం ఉదయం బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. సుమారు ఐదు గంటల పాటు జరిగిన కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మరణించగా చాలామంది పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. పరారైన వారి కోసం గాలిస్తున్నామని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ తెలిపారు. మృతుల్లో ఆరుగురి వివరాలు గుర్తించామని మిగిలిన నలుగురు ఎవరనేది తెలియాల్సి ఉందని పేర్కొన్నాయి. మృతుల్లో మాసా(రూ.8లక్షలు), మాద్వి లక్మా (5లక్షలు), మడకం కోసి (2లక్షలు), మడకం జీతూ (2లక్షలు), కోవాసి కోసా(2లక్షలు), హంగీ (మాసా భార్య, 2లక్షలు)పై మొత్తం రూ.21లక్షల రివార్డు ఉందని తెలిపారు.
Latest News