by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:15 PM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నెల 7న బాపట్లకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మెగా పేరెంట్- టీచర్ మీటింగ్‌ను బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వేదికగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఇప్పటికే జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చింది. సీఎంగా పగ్గాలు చేపట్టాక తొలిసారి జిల్లా కేంద్రం బాపట్లకు రానుండటంతో ఏర్పాట్లపై యంత్రాగాన్ని కలెక్టర్ వెంకటమురళి అప్రమత్తం చేశారు. గతంలో చేనేత దినోత్సవానికి జిల్లా పరిధిలోని చీరాలకు సీఎం చంద్రబాబు రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అది రద్దయన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరదల సమయంలో కూడా సీఎం పర్యటన రెండు సార్లు ఖరారై వాతావరణం అనుకూలించక రద్దైంది.
ఈ క్రమంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కోసం చంద్రబాబు బాపట్లకు రానుండడంతో ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి బాపట్ల పర్యటన ఖరారైనట్లు కలెక్టర్ తెలిపారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌ను శుక్రవారం జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ కొరకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని పోలీసు కవాతు మైదానం, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ క్రీడా మైదానాలను పరిశీలించారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎస్.పురుషోత్తం, ఆర్డీవో పి.గ్లోరియా, పీడీ కత్తి శ్రీనివాసరావు, ఎంఈవోలు ఎస్.నిరంజన్, డి.ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ జి.రఘునాధరెడ్డి, డీఈ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
Latest News