by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:24 PM
మహారాష్ట్ర ఎన్నికల్లో అఖండ విజయం దిశగా బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతుండడంతో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే తొలిసారి స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కట్టబెట్టిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత రెండున్నరేళ్ల కాలంలో మహాయుతి ప్రభుత్వం చేపట్టిన పనులకు ప్రజలు ఆమోదం తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇది అఖండ విజయం. అందుకు కారణమైన మహారాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహాయుతికి అఖండ మెజారిటీ లభిస్తుందని నేను ముందే చెప్పాను. అందుకు కారణమైన అక్కచెల్లెమ్మలు, రైతులు, సోదరులు, వృద్ధులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత రెండున్నరేళ్లలో మా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు ఆమోదించారు’’ అని మీడియాతో షిండే అన్నారు.ఇక మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని మీడియా ప్రశ్నించగా... రాష్ట్రానికి కాబోయే తర్వాతి సీఎం ఎవరనేది మహాయుతి కూటమి నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. గెలిచిన సీట్ల సంఖ్య ఆధారంగా ముఖ్యమంత్రి పదవిని కేటాయించడంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ముందుగా ఎన్నికల ఫలితాలు రానివ్వండి. ఆ తర్వాత మూడు పార్టీల నేతలం సమావేశమై చర్చించుకుంటాం. ప్రధాని మోదీ, జేపీ నడ్డా మార్గదర్శకత్వంతో సమష్టిగా చర్చిస్తాం. ఎన్నికల్లో మహాయుతిగా కలిసి పోరాడిన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి పదవిని నిర్ణయిస్తాం’’ అని షిండే స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణను సమష్టిగా నిర్ణయిస్తామని ఆయన ఉద్ఘాటించారు.ఎన్నికల ఫలితాల్లో మహావికాస్ అఘాడీ వెనుకబడడంపై షిండే ఆసక్తికరంగా స్పందించారు. గత రెండున్నరేళ్లు తమ ప్రభుత్వంపై కేవలం ఆరోపణలతోనే గడిపారని, అయితే వారి ఆరోపణలపై తాము ప్రతిస్పందించలేదని, తాము చేసిన పని కారణంగా వెలువడిన ఫలితాలే తమ సమాధానం అని అన్నారు.
Latest News