by Suryaa Desk | Sat, Nov 23, 2024, 07:25 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఇక ఊహకందని విజయాన్ని సాధించిన మహాయుతి కూటమి నేతలపై అభినందనల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం కూడా చేశారు. నవంబర్ 16,17 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. మహాయుతి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ర్యాలీలు, సభలకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఆ ప్రభావం ఎన్నికల్లోనూ కనిపించింది. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన మెజారిటీ స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహాయుతి కూటమి నేతలను అభినందిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ట్వీట్ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన మహాయుతి కూటమికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు కట్టబెట్టిన ఈ అఖండ విజయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజనరీ లీడర్‌షిప్ మీద మహారాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. మరాఠా ప్రజలు అభివృద్ధిని, నిజాయతీని, బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాన్ని, సనాతన ధర్మాన్ని ఎంచుకున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
విభజనవాదాన్ని కాదని ఐక్యతవైపు మహారాష్ట్ర ప్రజలు నిలిచారన్న పవన్ కళ్యాణ్.. వికసిత భారత్, వికసిత మహారాష్ట్ర నిర్మాణానికి మద్దతుగా నిలిచారని ట్వీట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పుట్టిన గడ్డ.. నిజం, శౌర్యం, న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. అభివృద్ధి, సమగ్రత వైపు మహరాష్ట్ర ప్రజలు నిలిచారన్న పవన్ కళ్యాణ్.. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్ సమష్టి నాయకత్వమే వారిలో విశ్వాసాన్ని నింపిదన్నారు.
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. మహాయుతి కూటమి అభ్యర్థుల తరుఫున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవమన్న పవన్ కళ్యాణ్.. మరాఠా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పరస్పరం సహకరించుకుందామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Latest News